International

Dry Dates: నిషేధం ఉన్నా పాక్‌ సరుకు భారత్‌లోకి.. గుట్టు రట్టు చేసిన డీఆర్ఐ!..

రచన: Venu6 నిమిషాల పఠనం

పాకిస్థాన్‌ నుంచి భారీ మొత్తంలో ఎండు ఖర్జూరాలను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాసిక్‌లో ఈ అక్రమ దిగుమతులను అడ్డుకున్నారు.

ఒకవైపు శాంతి మంత్రం... మరోవైపు వెన్నుపోటు.. పొరుగు దేశంగా భారత్ ఎప్పుడూ స్నేహహస్తం చాచినా, పాకిస్థాన్ మాత్రం తన కుల్లు బుద్ధిని మానడం లేదు. సరిహద్దుల్లో శాంతిని విచ్ఛిన్నం చేస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే ఆ దేశం నమ్ముకున్న ఏకైక సిద్ధాంతం. దశాబ్దాలుగా ఉగ్ర మూకలను సరిహద్దులు దాటిస్తూ భారత్‌లో రక్తం చిందించడమే పనిగా పెట్టుకుంది.

చొరబాట్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు-మత్తు పదార్థాల అక్రమ రవాణా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు... ఇలా ప్రతి విషయంలోనూ మన దేశ ప్రశాంతతను దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉంది.. దాయాది దేశం చేస్తున్న ఈ దొంగ దాడుల వల్ల భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. అయితే, ఎన్ని కుట్రలు చేసినా... భారత్ ప్రతిచర్య పాకిస్థాన్ కు గట్టిగానే తగులుతుంది.

అయితే తాజాగా మనదేశ అధికారులను వాణిజ్యం విషయంలో మభ్యపెట్టాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌ నుంచి భారీ మొత్తంలో ఎండు ఖర్జూరాలను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాసిక్‌లో ఈ అక్రమ దిగుమతులను అడ్డుకున్నారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ముంబయికి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 362 మెట్రిక్ టన్నులకు పైగా సరుకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఖర్జూరాలను యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నట్లు సంస్థ తమ పత్రాల్లో పేర్కొంది.

కానీ దర్యాప్తులో ఈ సరుకు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు.. భారత్‌కు నేరుగా సరుకు వస్తే అనుమానం కలిగే అవకాశం ఉండటంతో.. అక్రమ రవాణాదారులు మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలుత ఖర్జూరాలను కరాచీ పోర్టు నుంచి యూఏఈలోని జెబెల్ అలీ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి మరో నౌకలోకి సరుకును మార్చి.. నకిలీ పత్రాల ఆధారంగా భారత్‌కు పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మరోవైపు, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన సరుకును యూఏఈ నుంచి వస్తున్నట్లుగా చూపించి, భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఇలాంటి అక్రమ దిగుమతులు కేవలం నిబంధనల ఉల్లంఘనకే పరిమితం కావు. నకిలీ పత్రాలతో నిషేధిత వాణిజ్య మార్గాలను తప్పించుకోవడం వంటి చర్యలు, దేశ ఆర్థిక భద్రతకే కాకుండా కస్టమ్స్‌ వ్యవస్థకు కూడా తీవ్ర సవాల్‌గా మారతాయి.

ముఖ్యంగా ఉగ్రవాదం, అక్రమ రవాణా వంటి అంశాల్లో పాకిస్థాన్‌పై భారత్‌ ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిషేధిత దిగుమతులను మళ్లీ పరోక్ష మార్గాల్లో భారత్‌లోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు భద్రతా సంస్థలకు హెచ్చరికలుగా, మరింత అప్రమత్తత అవసరమన్న అంశాన్ని గుర్తుచేస్తున్నాయి.. ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ దిగుమతులపై భారత్‌ కఠిన ఆంక్షలు విధించింది. అప్పటి నుండి పాకిస్థాన్‌ నుంచి వచ్చే సరుకులపై డీఆర్ఐ తనిఖీలు ముమ్మరం చేసింది.

ఇప్పుడు 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాల వ్యవహారం.. నిషేధాలను తప్పించుకునేందుకు అంతర్జాతీయ ట్రేడ్ రూట్లను ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపై మరోసారి చర్చకు తెరలేపింది.. సరిహద్దుల్లోనే కాదు.. వాణిజ్య మార్గాల్లోనూ పాకిస్థాన్‌ నుంచి వచ్చే ప్రతి కదలికపై నిఘా అవసరమనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. అలాగే భారత్ లో అల్లర్లు సృష్టించడానికి ఇందులో ఏదైనా కుట్ర దాగుందా, లేక ఖర్జూరాలో ఏమైనా కలిపారా అనే విషయాన్ని కూడా క్లుప్తంగా పరిశోధించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#India#Pakistan#Dry Dates#DRI#smuggling racket#ban goods entering
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి