FSSAI : మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడాలి.. కానీ ఈ రోజుల్లోని పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. నాలికకు రుచినిచ్చే పదార్థాలే నెమ్మదిగా ప్రాణాలను హరించే స్లో పాయిజన్‌లా మారుతున్నాయి. పేరున్న రెస్టారెంట్లలో దొరికే ఖరీదైన తిండి మొదలుకుని, మార్కెట్లో లభించే కలర్‌ఫుల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వరకు అంతటా కల్తీ, మోసమే రాజ్యమేలుతోంది. ఇటీవల హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన నిజాలు చూసి వినియోగదారులు నివ్వెరపోతున్నారు. కుళ్లిన కూరగాయలు, సింథటిక్ కెమికల్ రంగులు, నిషేధిత మయోనైజ్, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు, కనీస లైసెన్సులు లేని కిచెన్‌ల మధ్య ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోంది.
150 బడా కంపెనీల గుట్టురట్టు..
మార్కెట్లో హెల్తీ ఫుడ్స్ పేరిట అమ్ముతున్న ప్యాకేజ్డ్ ఆహారం అసలైన బండారం తాజాగా బయటపడింది. ఉత్పత్తులలో నిండా చక్కెర నింపేసి, ప్యాకెట్లపై మాత్రం దర్జాగా "నో షుగర్", "100% ప్యూర్ ఫ్రూట్ జ్యూస్" అంటూ తప్పుడు లేబుల్స్ వేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్న నెస్లే, పెప్సికో, రెడ్‌బుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో సహా దాదాపు 150 ఆహార తయారీ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
లైఫ్‌స్టైల్ రోగాల రాజధానిగా భారత్
ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు భారతదేశాన్ని రోగాల కేంద్రంగా మారుస్తున్నాయి. డయాబెటిస్, ఒబెసిటీ, హైపర్‌టెన్షన్, గుండెజబ్బులు సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. దేశంలో ఏకంగా 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా, మరో 13.60 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ ముంగిట ఉన్నారు. దేశ జనాభాలో 28.6 శాతం మంది ఊబకాయం, ఏకంగా 35.5 శాతం మంది హైబీపీ బారినపడ్డారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్వయంగా రంగంలోకి దిగి, ఆహారంలో నూనె వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించాలంటూ ప్రత్యేక పిలుపునిచ్చారంటే ముప్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పొంచి ఉన్న 'హిడెన్ షుగర్' ముప్పు..
మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కంటికి కనిపించకుండా శరీరంలోకి చేరే ‘హిడెన్ షుగర్’ అత్యంత ప్రమాదకరంగా మారింది. సమోసాలు, బేకరీ ఫుడ్స్‌తో నంజుకునే టమాటో కెచప్‌లు, ప్యాకేజ్డ్ సాస్‌లు, రియల్ జ్యూస్‌ల పేరుతో మార్కెట్లో దొరికే లిక్విడ్ జూస్‌లలో పెద్ద మొత్తంలో చక్కెర దాగి ఉంటోంది. దీనికితోడు టీ, కాఫీలలో వేసే స్పూన్ల కొద్దీ షూగర్ లాంగ్ రన్‌లో శరీరాన్ని గుల్ల చేస్తోంది.
ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు, డోనట్లు, రోడ్డుపక్కన ఆయిల్‌లో వేయించే సమోసాలు, పకోడీల వంటి జంక్ ఫుడ్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్యాక్ చేసిన ఆహారం కంటే ఇంట్లో వండిన తాజా పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలని, ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ లేబుల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాడాలని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.












