క్రైమ్

karimnagar: కరీంనగర్‌లో వైద్యుడి విషాదాంతం.. పీజీ సీటు రాలేదన్న మనోవేదన కారణమా!?

రచన: Venu4 నిమిషాల పఠనం

విద్య మనకు విజ్ఞానాన్ని ఇస్తుంది. కానీ జీవితంలో వచ్చే పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి.. ఈ పోటీ ప్రపంచంలో ఎలా బ్రతకాలి.. అనే అంశాలు కూడా పాఠాల్లో చేర్చితే బాగుండేది..

చదువుల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా.. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకోకపోతే ఆ విజ్ఞానం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఓ వైద్యుడి విషాదాంతం.. ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరి ముందూ నిలబెడుతోంది. పీజీ సీటు రాలేదన్న తీవ్ర మనోవేదనతో 39 ఏళ్ల ఎంబీబీఎస్ వైద్యుడు పసుల గౌతమ్ బలవన్మరణానికి పాల్పడటం పలువురిని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌతమ్ గత నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ధర్మారం మండలంలోని నందిమేడారం, చొప్పదండి మండలంలోని కటికనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించారు. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సుమారు నెల రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి.. పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రెండుసార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినా ఆశించిన మెరిట్ రాకపోవడంతో సీటు దక్కలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా మానసిక ఒత్తిడి, ఆందోళనతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం గదిలోకి వెళ్లిన గౌతమ్.. తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు విగతజీవిగా కనిపించారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి పేర్కొన్నారు. ఇక చదువులో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని తపనపడటంలో తప్పులేదు.. కానీ ఆ లక్ష్యం ప్రాణాలు తీసుకునేంత పెద్దది కాకపోవచ్చు.. కావాలంటే మళ్లీ ప్రయత్నించవచ్చు.. మార్గాన్ని మార్చుకోవచ్చు.. కొంతకాలం ఆగి తిరిగి మొదలుపెట్టవచ్చు.

విద్య మనకు విజ్ఞానాన్ని ఇస్తుంది. కానీ జీవితంలో వచ్చే పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి.. ఈ పోటీ ప్రపంచంలో ఎలా బ్రతకాలి.. అనే అంశాలు కూడా పాఠాల్లో చేర్చితే బాగుండేది.. ఎందుకంటే కష్టాలు తాత్కాలికం.. కానీ ఒకసారి కోల్పోయిన ప్రాణం తిరిగి రాదు. లక్ష్యం చేరుకోలేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవడంలో తప్పులేదు.. సమస్యకు చావే పరిష్కారం అయితే లోకం శ్మశానం అవుతుందని అంటారు.. కాబట్టి చావడానికి చేసే ధైర్యాన్ని బ్రతకడం కోసం చేయండని ఎందరో మానసిక నిపుణులు సూచిస్తున్నారు..

#Telangana#karimnagar#MBBS doctor#Suicide#PG seat#failure
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి