Blue Drum case: అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చి, శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో పూడ్చేసిన భయానక ఘటనలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసులో నిందితురాలైన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇలాంటి అమానవీయ నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తాయని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా ఈ కఠిన తీర్పును ప్రకటించారు.
15 ముక్కలుగా నరికి.. డ్రమ్ములో వేసి సిమెంట్‌తో ప్యాక్ చేసి
గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతి కిరాతకంగా అంతమొందించింది. అంతటితో ఆగకుండా, నేరం బయటపడకుండా ఉండేందుకు సౌరభ్ మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికివేసింది. ఆ శరీర భాగాలను ఒక బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి, దుర్వాసన రాకుండా, ఎవరికీ అనుమానం కలగకుండా పూర్తిగా సిమెంటుతో కప్పేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు ప్రియుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు చెక్కేసింది. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని వెలికితీసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
జైలు నుంచే తీర్పు విన్న హంతకులు
ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున 22 మంది సాక్షుల వాంగ్మూలాలను, పక్కా ఫోరెన్సిక్ ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం కొద్దిరోజుల క్రితమే వీరిద్దరినీ దోషులుగా నిర్ధారిస్తూ తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు, తాజాగా ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరైన ముస్కాన్, సాహిల్లకు న్యాయమూర్తి మరణశిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పు అనంతరం హతుడు సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్ కన్నీటిపర్యంతమయ్యారు. "కలిసి జీవించడం ఇష్టం లేనప్పుడు విడిపోవాలి కానీ, ఇలా కట్టుకున్న వ్యక్తినే చంపి తల్లికి కడుపుకోత మిగల్చకూడదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మరెవరూ ఇలాంటి రాక్షసత్వానికి ఒడిగట్టకుండా ఉండాలంటే ఈ ఉరిశిక్ష సరైన గుణపాఠమని పేర్కొన్నారు.


