రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు నవంబరు రెండో వారంలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ పదవులను చేజిక్కించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు పావులు కడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రధాన ఆశావహులు తెరపైకి వచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం ఉమ్మడి కరీంనగర్ లో ప్రధానంగా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, ప్రోటోకాల్ పౌరసంబంధాల సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరికి చాన్స్ దక్కే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బీసీ కోటా గనుక ప్రకటిస్తే సత్తు మల్లేశంకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో సామాజిక న్యాయం, కుల సమీకరణాలకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు మంత్రులు.. ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు ఎస్సీ (మాదిగ) కోటాలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవునట్టు తెలుస్తుంది.
అలాగే ఈసారి బీసీ సామాజిక వర్గానికి, పద్మశాలి వర్గానికి ప్రాతినిధ్యం దక్కాల్సి ఉందనే చర్చ నడుస్తోందన్నట్టు టాక్ వినిపిస్తుంది.. కాగా బీసీ మున్నూరు కాపు కులానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం కూడా బీసీ కోటాలో పదవిని ఆశిస్తున్నారు.. మరో వైపు ఉమ్మడి జిల్లా పరిధిలోని రామగుండంకు చెందిన హార్కర్ వేణుగోపాల్ సైతం బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలి సామాజిక వర్గానికి చెంది.. కుటుంబ వారసులుగా గుర్తింపు ఉన్న వారిలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత రాజన్న, హైకోర్టు న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్ కీలక వ్యక్తులుగా ఉన్నారు. అయితే, రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాధాన్యతను పెంచుకుంటూ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే క్రమంలో పద్మశాలీలకు పెద్ద పీట వేస్తే, వీరిలో ఒకరికి అవకాశం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే ఇక్కడ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల పాత్ర అత్యంత కీలకమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నామినేటెడ్ పదవుల కోసం మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వద్దకు ఈ ముగ్గురు నేతలు తమ ప్రతిపాదనలు తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. మరోవైపు సత్తు మల్లేశంకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని, సామాజిక సమీకరణాల విశ్లేషణ తర్వాత ఆయనకే అవకాశం దక్కవచ్చని ఒక ప్రచారం మొదలైంది.
ఇదే సమయంలో అధిష్టానం పెద్దలతో ఉన్న సంబంధాలను కూడా కొందరు నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం సత్యనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల కనుసన్నల్లోనే ఈ లాబీయింగ్ నడుస్తోందనే టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా జిల్లాలో తమ వర్గానికి చెందిన నేతకు ఈ పదవి దక్కించుకోవడం ద్వారా భవిష్యత్తు స్థానిక సంస్థలు, తదుపరి ఎన్నికలపై పట్టు సాధించాలని మంత్రులు కూడా అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం.. అయితే ముగ్గురు సీనియర్ నాయకులు చెరో సామాజిక వర్గానికి (ఎస్సీ, బీసీ, బ్రాహ్మణ) ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరివైపు మొగ్గు చూపుతారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.. మరో 15 నుండి 20 రోజుల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చి అధిష్టానం తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.


