Bittu Tabahi: ఓ పక్క స్వచ్ఛ భారత్ అంటూ టీవీల్లో, ఫ్లెక్సీల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకుంటున్నాం.. పర్యావరణాన్ని కాపాడాలంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతున్నాం. కానీ గ్రౌండ్ లెవల్లో మన బుద్ధి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే పక్కా ఉదాహరణ. 20 ఏళ్ల ఓ కాలేజ్ కుర్రాడు.. తనకు ఈత రాకపోయినా, చేతులకు కనీసం గ్లౌజులు కూడా లేకపోయినా, ప్రాణాలనే ఫణంగా పెట్టి 8 నెలల పాటు రోజూ నదిలో దిగి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు. కానీ చుట్టుపక్కల జనాలు ఏం చేశారు? వారం తిరక్కుండానే మళ్లీ పాత రోజుల్లాగే ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు విసిరేసి నదిని మురికిగుంటలా మార్చేశారు. ఇది చూశాక ఎవరికైనా వచ్చే మాటేమిటంటే.. "బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువే లేదు.. ఈ జనాలు అస్సలు మారరు!".
ఈత రాదు.. పరికరాలు లేవు.. ఉన్నదల్లా తెగింపు మాత్రమే
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీ.. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి'గా అందరికీ తెలుసు. తను సాధారణంగా డిగ్రీ చదువుకుంటున్న కుర్రాడు. రోజూ చూసే అజ్నార్ నది ప్లాస్టిక్ చెత్తతో డంపింగ్ యార్డులా మారి కుళ్లిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ప్రభుత్వాలు పట్టించుకోవని తెలిసింది, అధికారుల వైపు చూస్తే పనవ్వదని అర్థమైంది.. అందుకే తానే రంగంలోకి దిగాడు. అతనికి అసలు ఈత రాదు, సేఫ్టీ బూట్లు లేవు, ఎలాంటి రక్షణ పరికరాలూ లేవు. అయినా కొందరు ఫ్రెండ్స్తో కలిసి రోజూ మురికి నీటిలోకి దిగేవాడు. ఆ దుర్వాసన భరిస్తూ, విషపూరిత ప్లాస్టిక్ వ్యర్థాలను ఒంటిచేత్తో ఎత్తిపోస్తూ ఏకంగా 8 నెలల పాటు ఒళ్లు హూనం చేసుకున్నాడు. ఎట్టకేలకు నదిని అద్దంలా మెరిపించి ప్రాణం పోశాడు. ఆ విజువల్స్ చూసి నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
వారం తిరక్కుండానే మళ్లీ చెత్తమయం..
కానీ ఆ నది బాగుపడిన ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. బిట్టూ ఎనిమిది నెలలు ధారపోసి చేసిన పనిని అక్కడి జనాలు కేవలం కొన్ని రోజుల్లోనే బూడిదలో పోసిన పన్నీరు చేసేశారు. పూజల సామాన్లు, ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు, ఏది దొరికితే అది యథేచ్ఛగా మళ్లీ నదిలోకి విసిరేశారు. కళ్లముందే నది మళ్లీ కాలుష్యపు కూపంగా మారిపోయింది. మళ్లీ మురికిగా మారిన నదిని చూసి బిట్టూ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నా 8 నెలల కష్టం ఇలా వృథా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ప్రాణాలు లెక్కచేయకుండా శుభ్రం చేస్తే, జనాలు మళ్లీ ఇలాగే తయారయ్యారు" అంటూ అతడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది.
ఒక కుర్రాడు స్వార్థం లేకుండా జనాల కోసం, ప్రకృతి కోసం అంత కష్టపడితే.. కనీసం దాన్ని అలాగే ఉంచాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకపోతే ఇంకేం మార్పు వస్తుంది? చెత్త పడేసేవాళ్లకు సిగ్గు లేనప్పుడు, అధికారులు కఠినంగా జరిమానాలు వేయనప్పుడు ఇలాంటి మంచి ప్రయత్నాలకు సమాజం ఇచ్చే బహుమతి ఇదే అవుతుందనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరిగినా బిట్టూ వెనక్కి తగ్గనని, మళ్లీ శుభ్రం చేస్తానని మొండిగా నిలబడ్డాడు. కానీ ఆలోచించాల్సింది మనం.. ఒక్క బిట్టూ ఎన్నిసార్లని శుభ్రం చేస్తాడు? మనం మారనంత వరకు అతడి కష్టానికి విలువేముంటుంది?.


