Bathukamma Sarees: తెలంగాణ ఆడపడుచులకు దసరా, బతుకమ్మ పండుగల వేళ అందాల్సిన ఉచిత చీరల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా పండుగకు ముందే పల్లెపల్లెనా సందడి చేస్తూ చేతికందే బతుకమ్మ చీరల పంపిణీ ఈసారి లేట్ కావడంతో అసలు ఇస్తారా లేదా అనే అనుమానాలను ఆడపడుచులు వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజులు సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ ప్రారంభం కాకపోవడం, మరోవైపు ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంలో ఉండటంతో మహిళల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు వచ్చింది సగమే!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలు, యువతుల సంఖ్య సుమారు 1.68 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 1.05 కోట్ల చీరల తయారీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. ఈ మొత్తం సంఖ్య సైతం రాష్ట్రంలోని మహిళలందరికీ సరిపోని పరిస్థితి ఉండగా, కనీసం ఆ ఆర్డర్ ఇచ్చిన చీరలు కూడా సమయానికి రెడీ కాలేదు. క్షేత్రస్థాయిలో అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కేవలం 51 లక్షల చీరలు మాత్రమే తయారయ్యాయి. అంటే ఆర్డర్ ఇచ్చిన దాంట్లో సగం కూడా ఇంకా పూర్తికాలేదు. మిగిలిన చీరల ఉత్పత్తి ఎప్పటికి పూర్తవుతుంది? పండుగ ముగిసేలోపు అవి పల్లెలకు ఎలా చేరుతాయి? అన్నది అధికారులకే పాలుపోని పరిస్థితిగా మారింది.
కాంగ్రెస్ మద్దతున్న సంఘాలకేనా
చీరల కొరత తీవ్రంగా ఉండటంతో పంపిణీ విధానంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత సంఖ్యలో ఉన్న చీరలను కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే స్వయం సహాయక మహిళా సంఘాలకే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హులైన మహిళకు బతుకమ్మ చీరలు అందే సంప్రదాయం ఉండగా, ఇప్పుడు రాజకీయ ప్రాతిపదికన, సెలెక్టివ్గా ఇవ్వాలని చూస్తే అది తీవ్ర వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది. పండుగ వేళ చీరలను పంపిణీ చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం, సరిపడా స్టాక్ లేకపోవడంతో ఈ దసరాకు మెజారిటీ మహిళల చేతికి బతుకమ్మ చీర అందడం కష్టమేనన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.


