అభిప్రాయం

1986 నుంచి 2026 వరకు.. మారిపోయిన మనిషి, మాయమైన మానవత్వం!

రచన: Venu••13 నిమిషాల పఠనం

జీవితం ఒక నిత్య ప్రవాహం.. కాలంతో పాటు ఎన్నో మార్పులను మోసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణం.. నిన్నటి జ్ఞాపకాలు మనసులో మిగిలిపోతాయి.. నేటి అనుభవాలు మనుషుల్ని మార్చేస్తాయి.. రేపటి ఆశలు జీవితాన్ని నడిపిస్తాయి

జీవితం ఒక నిత్య ప్రవాహం.. కాలంతో పాటు ఎన్నో మార్పులను మోసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణం.. నిన్నటి జ్ఞాపకాలు మనసులో మిగిలిపోతాయి.. నేటి అనుభవాలు మనుషుల్ని మార్చేస్తాయి.. రేపటి ఆశలు జీవితాన్ని నడిపిస్తాయి. కానీ ఈ ప్రయాణంలో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు మాత్రం మాయం అవకూడదు.

ఎందుకంటే కాలం మారుతుంది.. పరిస్థితులు మారతాయి.. తరాలు మారతాయి.. కానీ మనసుకు హత్తుకునే జ్ఞాపకాలు, కష్టాల్లో తోడుగా నిలిచే బంధాలు ఎప్పటికీ వెలకట్టలేనివే. ఇవన్నీ దాటి ఒక సారి జీవిత ప్రయాణాన్ని పరిశీలించుకుంటే.. చివరికి మిగిలేది సంపాదించిన ఆస్తులు కాదు.. మనం పంచిన ప్రేమ, నిలబెట్టుకున్న బంధాలు మాత్రమే.

ఇక 1986 నుండి 2026 వరకు అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం నుండి నేటి ఆధునిక యుగం వైపు వేగంగా పయనిస్తున్న మనిషి తన జీవితంలో కోల్పోయింది వెలకట్టలేని, తిరిగి పొందలేని విలువైన ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, ఆనందాలు, ఆప్యాయతలు, అనురాగాలు.. ఇక నాటి మానవ సంబంధాలు.. కల్మషం లేని, కుట్రలు కుతంత్రాలు తెలియని స్వచ్ఛమైన అమృత ధారాలు.. జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఉన్న ఒకటిగా బ్రతకాలని చెప్పే ఆదర్శ జీవితాలు..

ఆకాలంలో ఇళ్లు చిన్నవిగా ఉండేవి.. మనసులు విశాలంగా ఉండేవి. సౌకర్యాలు తక్కువగా ఉండేవి.. సంతోషాలు ఎక్కువగా కనిపించేవి. ఒకరి ఇంట్లో వంట వండితే.. ఆ వాసన పక్కింటివారికి చేరడమే కాదు, ఆ ఇంటి మనుషులతో అనుబంధం కూడా మల్లె తీగలా అల్లేది.. సంపెంగల సువాసనలు వెదజల్లేది.. అరుగు మీద అమ్మలక్కల కబుర్లు, రచ్చబండ దగ్గర పిచ్చాపాటీ ముచ్చట్లు.. పిల్లల కేరింతలు.. నిత్యం పండుగ వాతావరణం కనిపించేది.

ఇక నిన్నలా అనిపించే ఆ నిన్నటి జ్ఞాపకాలకి, నేటి యాంత్రిక వాస్తవాలకి నడుమ... మన జీవితాలు ఎంతగా మారిపోయాయి.. బంధాల స్థానంలో స్వార్థాలు పడగ విప్పాయి.. అప్పటి అనురాగానికి, ఇప్పటి ఆడంబరాలకి నడుమ సాగిన ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో మనిషి జీవితాలు బ్రతకలేని బడిపంతుళ్ల సామెతలను గుర్తుకు తెస్తున్నాయి.. కాలం మారింది. క్యాలెండర్‌లో అంకెలు మారాయి. 1986 కాస్తా 2026 అయింది.

ఈ మధ్య కాలంలో ప్రపంచం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్లింది. అలాగే ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడు.. కానీ మనసుల మధ్య దూరాన్ని మాత్రం తగ్గించుకోలేక పోతున్నాడు. అప్పుడు పిల్లల నవ్వులతో ఇళ్లు కళకళలాడాలని కోరుకునేవారు. ఇప్పుడు ఆర్థిక భారం, చదువుల ఖర్చులు, భవిష్యత్తుపై భయాలతో పిల్లలను కనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.

నాటి రోజుల్లో తల్లిదండ్రుల మాటకు విలువ ఉండేది. అలాగే తల్లిదండ్రుల మాటను దైవవాక్కుగా భావించి గౌరవించేవారు.. కానీ నేటి కాలంలో పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం పెరిగింది. అది మంచిదే. కానీ ఆ మార్పు మధ్య పరస్పర గౌరవం తగ్గింది. ఇకమరో బాధాకర విషయం ఏమిటంటే.. నేడు... పిల్లల మనసులు గాయపడకూడదని, వారి కోపానికి భయపడి తల్లిదండ్రులే బిడ్డలను గౌరవించాల్సిన విచిత్ర స్థితి నెలకొనడం..

ఎందుకంటే.. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం ఎంత ముఖ్యమో, తల్లిదండ్రులు పిల్లల మనసును అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. గౌరవం అంటే భయంతో తలవంచడం కాదు.. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. ఇక నాడు పెళ్లంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల అనుబంధం. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల చరిత్రకు సాక్ష్యం.. అందుకే నాడు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి నిలబడాలనే ఆలోచన బలంగా ఉండేది.

ఆ సమయంలో భార్య భర్త అంటే పార్వతి పరమేశ్వరుల అర్థ నారీశ్వర తత్వానికి నిదర్శనం.. కలిసి బ్రతికిన వాళ్ళే కలిసి మరణించడానికి వెనుకాడని పవిత్ర బంధాలు ఆచరణాత్మకంగా ఉండేవి.. నేడు పెళ్లికి ఎన్నో అంచనాలు, ఎన్నో లెక్కలు. అవి నెరవేరకపోతే విడిపోవాలనే నిర్ణయాలు కూడా వేగంగా పరిగెత్తుతున్నాయి. మనసు ప్రవాహాన్ని తట్టుకుని నిలబడే వారికంటే ఆ ప్రవహంలో కొట్టుకుపోయే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఒకప్పుడు తాళికి ఉన్న బలం నేటి కాలంలో బలహీనపడింది. పెళ్లి అంటే నచ్చని గాజులు తీసి నచ్చిన గాజులు వేసుకున్నంత సులువుగా మారి పోయింది. అయితే బాధను భరిస్తూ బంధంలోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న అపార్థాలను ప్రేమతో పరిష్కరించుకునే ఓపికను మాత్రం కోల్పోకూడదు.. ఆ కాలంలో జంట మధ్య తగాదా వస్తే ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అమ్మమలు, నాయనమ్మలు, తాతయ్యాలు ఆ తగువును పరిష్కరించే వారు. కానీ నేటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు మాయం అవడం వల్ల పరిష్కారం కంటే విడిపోవడమే మేలు అనే అభిప్రాయాలు పెరిగాయి..

అప్పుడు ఊర్లో ఎవరు ఉంటున్నారో పేర్లతో సహ గుర్తుండేది. ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా చుట్టుపక్కల వాళ్లు తోడుగా నిలిచేవారు. ఇప్పుడు పక్కింటి తలుపు వెనుక ఎవరు నివసిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.. చేతిలో ఫోన్ ఉంది.. ప్రపంచమంతా పరిచయమే. కానీ పక్కనే ఉన్న మనిషి క్షేమం అడగడానికి మాత్రం సమయం దొరకడం లేదు.

అలాగే నాడు ఉద్యోగం కోసం పల్లె నుంచి పట్టణానికి వచ్చేవారు. నేడు పట్టణాల రద్దీని, ఒత్తిడిని తట్టుకోలేక ప్రశాంతత కోసం పల్లెబాట పడుతున్నారు. ఒకప్పుడు డబ్బు సంపాదిస్తే జీవితం బాగుంటుందని అనుకున్నారు. ఇప్పుడు డబ్బుతో పాటు ఆరోగ్యం, ప్రశాంతత, మానసిక సంతోషం కూడా కావాలని కోరుకుంటున్నారు. అప్పట్లో ఉన్నదాంట్లో సంతృప్తి వెతికేవారు. ఇప్పుడు లేనిదాని కోసం జనం పరుగులు తీస్తున్నారు.

ఒకప్పుడు ఒకరి సంపాదనతో కుటుంబమంతా కలిసి జీవించిన సందర్భాలు ఉండేవి. ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తున్నా.. ఖర్చులు, బాధ్యతలు, భవిష్యత్తుపై ఆందోళనలు కుటుంబాలను వెంటాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాడు బామ్మలు, అమ్మమ్మలు చెప్పే పేదరాశి పెద్దమ్మ వంటి కథలు వినిపించేవి.. నలుగురు కూర్చుంటే యోగ క్షేమాలు, మంచి చెడులు మాత్రమే వినిపించేవి..

రామాయణ గాధలు, మహాభారత పోరాటాలు, భాగవత కథలు, భగవత్ గీత బోధనలు మనుషులకు సంస్కారం నేర్పిస్తే.. నేడు అరచేతిలో ఉన్న విజ్ఞానం అజ్ఞానులుగా మారుస్తూ.. మానవతా విలువలను మంట కలిపేస్తుంది. సమాచారం పెరిగినంతగా ఆలోచన పెరగడం లేదు.. వందల మందితో ఆన్‌లైన్‌లో అనుబంధం ఉన్నా.. మనసు విప్పి మాట్లాడేందుకు ఒక్క మనిషి కూడా దొరకని ఒంటరితనం ఎక్కువై పోతుంది.

నాడు పేదరికం ఉన్నా పంచుకునే మనసు ఉండేది. నేడు సంపద పెరుగుతున్నా పోల్చుకునే మనస్తత్వం పెరుగుతోంది. పక్కవారి సంతోషాన్ని చూసి ఆనందించే రోజుల నుంచి.. వారి విజయాన్ని చూసి మన జీవితాన్ని తక్కువగా భావించే రోజులకు మనిషి జీవితం మారింది. కాలంతో పోటీ పడుతున్న మనిషి అదే కాలంలో తన విలువలను సమాధి చేస్తున్న విషయాన్ని మరచిపోయి.. కృతిమంగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. కలసి ఉంటే కలదు సుఖం అనేది నాటి మాట అయితే కలసి ఉంటే కష్టాల పాలవుతాం అనేది నేటి ఫిలాసఫీగా మార్చుకున్నాడు.

ఒకప్పుడు ఉచితంగా లభించే సలహాలు నేడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు. చివరికి వరంగా దక్కిన ప్రకృతికి వెల కడుతున్నాడు.. నిజానికి ఆ కాలంలోనూ కష్టాలు, అసమానతలు, కుటుంబ సమస్యలు ఉండేవి. కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండేది. కానీ నేడు మహిళలకు అవకాశాలు పెరిగాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ పెరిగింది. వైద్యం, సాంకేతికత, జీవన సౌకర్యాలు మెరుగయ్యాయి. మారింది కాలం మాత్రమే కాదు.. మనిషి ఆలోచించే విధానం కూడా..

కానీ ఈ అభివృద్ధి ప్రయాణంలో మనం కోల్పోకూడనివి కొన్ని ఉన్నాయి. ఆప్యాయంగా పలకరించడం.. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం.. మనవాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడటం. ఎందుకంటే జీవితం అంటే ఖరీదైన ఇల్లు కాదు.. ఆ ఇంట్లో మన కోసం ఎదురుచూసే మనుషులు. విజయం అంటే బ్యాంకులో పెరిగే బ్యాలన్స్ మాత్రమే కాదు.. కష్టం వచ్చినప్పుడు మన చేయి పట్టుకునే బంధాలు.

1986 నిన్నటిలా అనిపించవచ్చు. 2026 రేపటి చరిత్రగా మారిపోవచ్చు. కానీ ఈ రెండు కాలాల మధ్య మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. నాడు ధనవంతులు సైతం ఏ ఆడంబరం లేకుండా సాధారణంగా, పేదవారిలా వినయంగా జీవించేవారు. నేడు... తిండికి లేకపోయినా, అప్పులు చేసి అయినా పేదవారు ధనవంతుల్లా కనిపించాలని తాపత్రయపడుతున్నారు.. లోపం ఎక్కడ..

మన దగ్గర వస్తువులు పెరిగాయా.. లేక విలువలు తగ్గాయా.. మన పరిచయాలు పెరిగాయా.. లేక నిజమైన బంధాలు తగ్గాయా.. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి.. కానీ వాటి కంటే ముఖ్యంగా నేడు... ఆ పుస్తకాల స్థానాన్ని వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు ఆక్రమించేశాయి. హృదయపూర్వక పలకరింపులు మాయమై, ఎమోజీల ప్రదర్శనగా బంధాలు మారాయి.. 1986.. వినడానికి నిన్నటిలాగే ఉంది. కానీ 2026 నాటికి మనం కోల్పోయిన విలువలు, మర్చిపోయిన మానవతా సంబంధాలు మళ్లీ తిరిగిరావు..

అయితే కాలాన్ని మళ్ళీ వెనక్కి తిప్పలేం. కానీ మన ప్రవర్తనను మార్చుకోవచ్చు. ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతో కాసేపు మాట్లాడవచ్చు. పక్కింటివారిని పలకరించవచ్చు. తల్లిదండ్రులకు సమయం ఇవ్వవచ్చు. పిల్లల మాట వినవచ్చు. మనిషిని మనిషిగా ప్రేమించవచ్చు. ఎందుకంటే.. నలభై ఏళ్ల తర్వాత మనం ఎంత సంపాదించామన్నది కాదు.. మనం ఎందరి మనసుల్లో ప్రేమను సంపాదించామన్నదే ఈ జీవితానికి విలువను తెస్తుంది..

#1986 vs 2026#Changing Lifestyle#Human Relationships#Family Values#Modern Life#Social Changes#Emotional Connections#Generation Gap#Lost Human Values#Life Lessons
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి