National

UPI: పండుగల వేళ ‘యూపీఐ’ ట్విస్ట్.. తెరవెనుక ఏం జరిగింది?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

UPI: పండుగల సీజన్ మొదలైంది అంటే చాలు.. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. పల్లెటూరి కిరాణా కొట్టు నుంచి నగరాల్లోని భారీ షాపింగ్ మాల్స్ దాకా కరెన్సీ నోట్ల సవ్వడి కంటే ‘క్యూఆర్ కోడ్’ స్కానింగ్‌ల చప్పుడే ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా మారిన యూపీఐ నెట్‌వర్క్‌పై సరిగ్గా ఇలాంటి పండుగ వేళ ఒక భారీ పిడుగు పడబోయింది.

UPI: పండుగల సీజన్ మొదలైంది అంటే చాలు.. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. పల్లెటూరి కిరాణా కొట్టు నుంచి నగరాల్లోని భారీ షాపింగ్ మాల్స్ దాకా కరెన్సీ నోట్ల సవ్వడి కంటే ‘క్యూఆర్ కోడ్’ స్కానింగ్‌ల చప్పుడే ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా మారిన యూపీఐ నెట్‌వర్క్‌పై సరిగ్గా ఇలాంటి పండుగ వేళ ఒక భారీ పిడుగు పడబోయింది. రూ.2,000 దాటిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరుతో కొత్త ఛార్జీల బాదుడు మొదలుకావాల్సింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. వ్యాపార వర్గాల ఆందోళనలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది.

రంగంలోకి కొత్త లెక్కలు

దేశవ్యాప్తంగా సాగే డిజిటల్ చెల్లింపుల వ్యవహారాలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన కస్టమర్-టు-మర్చంట్ (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిని అక్టోబర్ 15 నుంచే పక్కాగా అమల్లోకి తేవాలని భావించారు.

ఈ ఛార్జీల భారం ఎలా ఉంటుందంటే.. రూ.2,000 దాటిన ప్రతి పేమెంట్‌పై వ్యాపారి ఖాతా నుంచి నేరుగా కమిషన్ కట్ అవుతుంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు రూ.2,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.8 కోత పడుతుంది. అదే రూ.10,000 బిల్లు కడితే ఏకంగా రూ.40 వ్యాపారి జేబు నుంచి పోతుంది. ఒక్కో లావాదేవీపై గరిష్టంగా రూ.300 వరకు ఛార్జీ విధించాలన్నది ప్రతిపాదన. రోజువారీగా లక్షల రూపాయల వ్యాపారం చేసే రిటైలర్లకు, వ్యాపారులకు ఈ భారం ఊహించని విధంగా తడిసిమోపెడవుతుంది.

పండుగ వేళ వ్యాపార సంఘాల తిరుగుబాటు!

దసరా, దీపావళి వేళ దేశంలో అమ్మకాలు పీక్ స్టేజ్‌కు చేరుకుంటాయి. సరిగ్గా ఈ టైమ్‌లోనే కొత్త ఛార్జీలను మోపితే వ్యాపార నిర్వహణ ఖర్చులు తట్టుకోలేమని వ్యాపార వర్గాలు, ప్రధాన ఫిన్‌టెక్ కంపెనీలు గళమెత్తాయి. ఈ అదనపు భారాన్ని భరించలేక చివరికి వ్యాపారులు ఆ మొత్తాన్ని పరోక్షంగా వినియోగదారులపైనే రుద్దే ప్రమాదం ఉందని, తద్వారా సామాన్యుడు తిరిగి నగదు చెల్లింపుల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఎన్‌పీసీఐ ఒక అడుగు వెనక్కి తగ్గింది. వ్యాపారుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 15 అమలు తేదీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాత్కాలిక ఉపశమనమే..

ప్రస్తుతానికి ఎన్‌పీసీఐ తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు, వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ ఇది శాశ్వత రద్దు మాత్రం కాదు. దీపావళి పండుగ ముగిసిన తర్వాత అన్ని వర్గాలతో చర్చించి కొత్త తేదీని ప్రకటిస్తామని ఎన్‌పీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే పండుగ సీజన్ ముగిసే వరకు ఈ బాదుడు తప్పినట్టే అయినా, పండుగ తర్వాత ఏ క్షణమైనా కొత్త తేదీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ పండుగ సీజన్ ఎలాంటి అదనపు కట్ లేకుండా సాఫీగా సాగిపోనుంది.

#UPI#UPI Charges#NPCI#MDR Charges#Digital Payments#UPI Transaction Fees#Merchant Discount Rate#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి