ఒక ప్రాణి భూమి మీదికి రావాలంటే అమ్మ కడుపులో అజ్ఞాతవాసం చేయవలసిందే.. అలాంటి ప్రాణులు భూమి మీద అంతరించిపోవడానికి ఎక్కువ సమయం లేదనే నివేదికలు తరచుగా హెచ్చరించడం ఆందోళన కలిగిస్తున్నాయి.. ఊహించని అభివృద్ధిని భూమి మీద సాధించిన మనిషి ఒకవైపు.. అదే అభివృద్ధి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న పరిణామాలు మరోవైపు. ఎన్నో ఏళ్ల నుండి జరుగుతున్న ఈ విధ్వంసం ఒక్కొక్కటిగా పేరుకుపోయి.. నేడు విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల విధ్వంసం, జీవవైవిధ్యం క్షీణించడం.. అణుయుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం, భయంకరమైన జీవ ఆయుధాల తయారీ.. ఇవన్నీ భవిష్యత్తు మానవాళికి తీవ్రమైన సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే తరాల మనుగడ పై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో 75 ఏళ్లలోనే మానవాళి అంతమవుతుందనే హెచ్చరికలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే మానవ మనుగడకు అవసరమైన ప్రకృతి వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నది విస్మరించలేని వాస్తవం. వాతావరణ మార్పులే ఈ ముప్పులో కీలకమైన అంశంగా నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగం, పారిశ్రామిక కార్యకలాపాలు, అడవుల నరికివేత కారణంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత పెరుగుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన వేడిగాలులు, కరువులు, వరదలు, అడవిలో మంటలు వంటి విపత్తుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని నివేదికలు సైతం హెచ్చరిస్తున్నాయి. అలాగే వీటి ప్రభావం కేవలం ప్రకృతిపైనే కాదు.. వ్యవసాయం, తాగునీటి లభ్యత, ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపైనా కూడా పడుతుందని అంటున్నారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం క్షీణించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అడవులు తగ్గిపోవడం, జాతులు అంతరించిపోవడం, సముద్రాల్లో కాలుష్యం పెరగడం వల్ల ప్రకృతి తన సహజ సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక మానవ మనుగడకు అవసరమైన ఆహారం, నీరు, ఔషధాలు, స్వచ్ఛమైన గాలి.. ఇవన్నీ ప్రకృతి వ్యవస్థలతో ముడిపడి ఉన్నాయి. ఈ వ్యవస్థలు బలహీనపడితే మానవ జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఇవేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాలు, అణ్వాయుధ ముప్పు, కొత్త అంటువ్యాధులు, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వల్ల తలెత్తే ప్రమాదాలు కూడా మానవాళి భవిష్యత్తుపై చర్చకు దారితీస్తున్నాయి. ఒక్కో ముప్పు విడిగా కనిపించినా.. కొన్ని పరిస్థితుల్లో ఇవి ఒకదానితో మరొకటి కలిసిపోయి భారీ సంక్షోభాన్ని సృష్టించవచ్చు అని అంటున్నారు..
మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య జర్నల్ "ది లాన్సెట్" (The Lancet Report) మానవాళి 2100 సంవత్సరం నాటికి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. "లాన్సెట్ కమిషన్ ఆన్ 21 సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్" నివేదికలో విషయాన్ని వెల్లడించింది. రాబోయే 75 ఏళ్లలో మానవ ఆరోగ్యానికి, మనుగడకు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి తీవ్ర నష్టం కలిగిస్తుందని 35 మంది అంతర్జాతీయ నిపుణులు గుర్తించారని చెబుతుంది.
ఇప్పటికైనా ప్రపంచ దేశాల అధినేతలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తూనే.. ఈ ముప్పులను ముందే ఊహించి, నివారించడానికి కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని కోరింది. అందుకోసం తగిన నిధులు కేటాయించే దిశగా ఆలోచించాలని సూచించింది. ఇక త్వరలో జర్మనీలోని బెర్లిన్లో జరగనున్న వరల్డ్ హెల్త్ సమ్మిట్ లో ఈ పూర్తి నివేదికను అధికారికంగా సమర్పించనున్నారని కమిషన్ తెలిపింది.
ఇక ప్రపంచమే అంతం అవనికి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఆ అభివృద్ధిని అనుభవించడానికి మనిషి లేనప్పుడు.. ఈ అభివృద్ధి ఎవరికోసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకృతిని ప్రేమించలేని మనిషి.. సాటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి.. తోడేలు తొలుకప్పుకుని అభివృద్ధి పేరిట భవిష్యత్తు తరాల మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తున్న మనిషి.. చివరికి సాధించేది ఏమిటనే ఆలోచనలు కొందరిలో పుడుతున్నాయి.
మొత్తానికి ఎన్ని నివేదికలు విడుదల అయిన.. ఎంత మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న.. మనిషిలో ఉన్న స్వార్థం ముందు మంచి అనేది మంచులా కరిగిపోతున్నంత కాలం ప్రపంచం ప్రమాదం అంచున ప్రయాణం చేస్తూనే ఉంటుందని అంటున్నారు. ఒక వ్యవస్థను మార్చాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు.. అది శతాబ్ధాల నిరీక్షణ.. ఇక ఇప్పటికే ఓజోన్ పొర (Ozone layer) సైతం పలుచబడి దానికి ఉన్న హోల్ పెద్దగా అవుతుందనే హెచ్చరికలున్నాయి.
ఫలితంగా సూర్యరశ్మిలో ఉండే హానికరమైన అల్ట్రావయోలెట్ (UV - Ultraviolet) కిరణాల వల్ల మనుషులలో చర్మ క్యాన్సర్లు, కంటి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని, కేవలం మనుషులకే కాకుండా, మొక్కల వృద్ధి దెబ్బతినడానికి, సముద్రంలోని జలచరాలు నశించడానికి కూడా ఇది కారణమవుతుందని ఎప్పుడో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.. అందుకే మనిషి ఆలోచన మారనంత వరకు ఏది మారదని అంటారు.. మొత్తానికి ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్న ఇలాంటి కథనాలు కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయట..


