Mohammed bin Salman: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు రోజురోజుకూ మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తిమంతమైన రాజ్యాల్లో ఒకటైన సౌదీ అరేబియా రాజభవనాల్లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత, అభద్రత నెలకొంది. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ భూభాగంపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ ఆయన రహస్య బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
వారం రోజులుగా అజ్ఞాతం..
గత వారం రోజులుగా మహమ్మద్ బిన్ సల్మాన్ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. శత్రువుల నిఘా కన్ను పడకుండా ఉండేందుకు ఆయన కదలికలను భద్రతా విభాగం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అత్యున్నత శిక్షణ పొందిన ఎలైట్ కమాండోల భారీ భద్రతా వలయం నడుమ.. ఒక రహస్య బంకర్ నుంచి మరో సురక్షితమైన రాజభవనానికి ఆయనను నిరంతరం మారుస్తున్నారు. దేశంలో అత్యంత కీలకమైన విమానాశ్రయాలు, వ్యూహాత్మక ఇంధన శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా హూతీలు తమ డ్రోన్లు, క్షిపణి దాడులను తీవ్రతరం చేయడంతోనే ఈ స్థాయి హై-అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
వందల మైళ్ల దూరం నుంచి రియాద్‌పై పంజా
హూతీల ఆధిపత్యంలో ఉన్న యెమెన్ భూభాగానికి సౌదీ రాజధాని నగరం రియాద్ వందల మైళ్ల దూరంలో ఉంది. అయినప్పటికీ, ఆ భారీ దూరాన్ని అధిగమిస్తూ హూతీలు ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులు నేరుగా రియాద్ గగనతలాన్ని తాకడం సౌదీ రక్షణ దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాజభవనాలు, ఆయిల్ రిఫైనరీల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించినప్పటికీ ముప్పు మాత్రం తప్పడం లేదు.
తగ్గిపోతున్న నిల్వలు..
సౌదీని అత్యంత కలవరపెడుతున్న అసలు విషయం మరొకటి ఉంది. హూతీలు నిరంతరాయంగా ప్రయోగిస్తున్న క్షిపణులను గాల్లోనే పేల్చివేయడానికి సౌదీ వాడుతున్న 'క్షిపణి ఇంటర్సెప్టర్ల' నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. అధునాతన రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, వాటికి అవసరమైన ఇంటర్సెప్టర్లు నిండుకుంటే భవిష్యత్ దాడులను ఎలా నిలువరించాలన్నది సౌదీ ఆర్మీకి అతిపెద్ద తలనొప్పిగా మారింది. ప్రపంచ మార్కెట్‌ను శాసించే చమురు కేంద్రాలను కాపాడుకుంటూనే, తన ప్రాణాలను కాపాడుకోవడానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ రహస్య బంకర్లకే పరిమితం కావడం పశ్చిమాసియా రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది.


