టాప్ న్యూస్

Trending : పెళ్లి కష్టం బ్రో.. విడాకులు చాలా సులభం!

రచన: Kumar•••11 నిమిషాల పఠనం

కాలం మారింది, రోజులు మారాయి, పెళ్లిబంధానికి బీటలు వారాయి. పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న మనస్పర్దలు, ఇగోలు చాలు. నా మాటే వినాలని భర్త..లేదు నా మాటే వినాలని భార్య వాదించడం.. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండటం కంటే వేరు కాపురం పెట్టాలని అమ్మాయి కండిషన్స్ కామన్ అయిపోయింది.

-ఒకప్పుడు పెళ్లంటే జన్మజన్మల బంధం..

-నాడు వంద అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలనేవారు

-ఇప్పుడు కాలం మారింది..పెళ్లి కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికే ప్రాధాన్యం

-నాడు అత్తమామలంటే తల్లిదండ్రులతో సమానం

-ఇప్పుడు పెళ్లయ్యిందంటే సెపరేటు కాపురం పెట్టాల్సిందే..

-నాడు భర్త మాటకు విలువుండేది.. నేడు నువ్వు నేను సమానం అనే ధోరణి..

-మనస్పర్దలు వచ్చాయంటే కలిసిఉండటం కాదు.. విడాకుల కోసం పరుగులు

కాలం మారింది, రోజులు మారాయి, పెళ్లిబంధానికి బీటలు వారాయి. పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న మనస్పర్దలు, ఇగోలు చాలు. నా మాటే వినాలని భర్త..లేదు నా మాటే వినాలని భార్య వాదించడం.. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండటం కంటే వేరు కాపురం పెట్టాలని అమ్మాయి కండిషన్స్ పెట్టడం, వారి కుటుంబానికే అధికప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం, భర్త సంపాదనలో భాగం కోరడం, తన సంపాదనలో వేలు పెట్టొద్దనడం, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వంటి కారణాలతో ముడు ముళ్లతో ఒక్కటైన బంధాలు .. కొన్నాళ్లకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి.విడాకుల కోసం పోటీ పడుతున్న జంటల్లో కొన్ని సార్లు అమ్మాయి సైడ్, మరికొన్ని సందర్భాల్లో అబ్బాయి సైడ్ తప్పులు ఉంటున్నట్టు తెలుస్తోంది.

40 ఏళ్ల కిందట బలమైన బంధం..

నాలుగు దశాబ్దాల క్రితం వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బలమైన బంధం.పెళ్లి నిశ్చయమైందంటే జీవితాంతం కలిసుండాలనే ఆలోచన బలంగా ఉండేది. దంపతుల మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పేవారు. అవసరమైతే వధూవరుల కుటుంబాలు 100 అబద్ధాలైనా చెప్పి పెళ్లి చేయడానికి ప్రయత్నించేవనే సామెత ఉంది. అది అప్పటి సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. విడాకులు తీసుకోవడం చాలా అరుదు.కానీ నేడు పరిస్థితులు మారాయి. పెళ్లి చేసుకోవడమే కష్టంగా మారుతోందని కొందరు భావిస్తుంటే, వివాహ బంధాలు త్వరగా తెగిపోతున్నాయనే చర్చ మొదలైంది.

మారిన జీవనశైలి.. మారిన ఆలోచనలు

1980లలో కుటుంబ వ్యవస్థకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉండేది. తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒకే కుటుంబంలా కలిసి జీవించేవారు. కుటుంబంలోని పెద్దల మాటకు విలువ ఇచ్చేవారు. సమస్యలు వస్తే వాటిని కుటుంబంలోనే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించేవారు. ప్రస్తుతం విద్య, ఉద్యోగాలు, పట్టణీకరణ, ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడంతో వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇది మహిళలకు మాత్రమే కాదు పురుషులకూ వర్తిస్తుంది.వ్యక్తిగత స్వేచ్ఛకు, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యత కుదరక మనస్పర్దలు పెరిగి వివాదాలకు దారితీస్తున్నాయి.

స్వేచ్ఛ, సమానత్వానికి మధ్య ఘర్షణ

గతంలో మహిళలు కుటుంబం కోసం తమ ఇష్టాలను, ఆశయాలను పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేడు మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ స్వేచ్ఛను పరస్పర గౌరవంతో ఉంటే ఓకే. కానీ, ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేలా ఉంటే సమస్యలు వస్తాయి.'నువ్వు ఎంతైతే నేనూ అంతే' అనే సమానత్వ భావన పరస్పర గౌరవానికి దారితీయాలి. తప్ప పోటీకి కాదు. అదే సమయంలో భార్యను తనకు సమానమైన వ్యక్తిగా చూడలేని భర్త ఆలోచనా విధానం కూడా బంధాన్ని దెబ్బతీస్తున్నది. సమానత్వం అంటే హక్కులతోపాటు బాధ్యతలను కూడా పంచుకోవాలి. ఈ విషయంలో మగవారు న్యాయం చేస్తున్నా మహిళలు చేయడం లేదని తెలుస్తోంది.

అత్తమామలతో అనుబంధానికి గ్యాప్..

ఒకప్పుడు అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా చూడాలనే అంచనాలు ఉండేవి. నేడు కొత్తగా పెళ్లయిన జంటలు తమ వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రుల జోక్యం తగ్గాలని కోరుకుంటున్నారు. అత్తమామలు కూడా కోడలు లేదా అల్లుడి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. కోడలు గౌరవం ఇవ్వకపోవడం, అత్తమామలు ప్రతి విషయాన్ని నియంత్రించాలనుకోవడం.. ఈ రెండూ కుటుంబంలో దూరాన్ని పెంచుతున్నాయి. గౌరవం అనేది బలవంతంగా రాబట్టేది కాదు.. పరస్పర ప్రవర్తనతో సంపాదించేది. అబ్బాయి పేరెంట్స్‌కు కోడలు గౌరవం ఇస్తే బంధం బలంగా ఉంటోంది. లేదంటే గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్తోంది.

ఫ్రెండ్స్, పార్టీలు.. ఫ్యామిలీకి తగ్గుతున్న సమయం?

సామాజిక మాధ్యమాలు, ఫ్రెండ్స్‌కు సమయం ఇవ్వడం, పార్టీలు, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం పెరిగింది. ఇవన్నీ తప్పు అని చెప్పలేం. కానీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించకుండా, కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా వ్యక్తిగత ఆనందానికే ప్రాధాన్యం ఇస్తే అపార్థాలు నానాటికీ పెరుగుతాయి. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనసులు కలవని పరిస్థితి ఏర్పడుతోంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గి, చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి.

పిల్లలు వద్దనే ఆలోచన.. బాధ్యతల భయమా?

ఆర్థిక భారం, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యక్తిగత లక్ష్యాల కారణంగా కొందరు దంపతులు పిల్లలు వద్దని లేదా ఆలస్యంగా కనాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరీ వ్యక్తిగత నిర్ణయం.అయితే, పిల్లలను కనాలా? వద్దా? అనే విషయంలో పెళ్లికి ముందే ఇద్దరి అభిప్రాయాలు స్పష్టంగా చర్చించుకోకపోతే, వివాహానంతరం తీవ్రమైన విభేదాలు రావచ్చు. పిల్లలు ఉన్న వారు విడాకులు తీసుకునేందుకు ఆగిపోతున్నారు. పిల్లల కోసం ఆలోచిస్తున్నారు. అదే కిడ్స్ లేని ఏం ఆలోచించకుండా డివర్స్ అప్లయ్ చేస్తున్నారు.

విడాకులు పెరగడానికి అసలు కారణం ఏమిటి?

ఇటీవలి కాలంలో వివాహ బంధాలు బలహీనపడటానికి మహిళల స్వేచ్ఛ ఒక్కటే కారణం కాదు. పురుషుల ఆధిపత్య ధోరణి, ఆర్థిక సమస్యలు, అనుమానాలు, గృహహింస, మద్యపానం, వివాహేతర సంబంధాలు, పరస్పర అవగాహన లోపం, రాజీపడే స్వభావం తగ్గడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. గతంలో విడాకులు తక్కువగా కనిపించాయంటే అప్పటి వివాహాలన్నీ సంతోషంగా ఉన్నాయని కాదు. సామాజిక ఒత్తిడి, ఆర్థిక ఆధారపడటం, పిల్లల భవిష్యత్తు, పరువు ప్రతిష్ఠల భయం కారణంగా ఎంతోమంది మహిళలు, పురుషులు ఇష్టంలేని బంధాల్లోనూ కొనసాగిన సందర్భాలున్నాయి. కానీ, నేడు మహిళలు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడానికి భయపడటం లేదు. అమ్మాయి తరఫు కుటుంబం ఆమెకు మద్దతు ఇచ్చే రోజులు వచ్చాయి.దీంతో మహిళలు డేర్ స్టెప్ తీసుకుంటున్నారు. గతంలో విడాకుల మాట రానిచ్చేవారు కాదు అమ్మాయి కుటుంబసభ్యులు. పరువు ప్రతిష్టల కోసం వెనకడుగువేసేవారు.

ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారింది. అబ్బాయి కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తులు,బ్యాగ్రౌండ్ చెకింగ్ చాలా చేస్తున్నారు అమ్మాయి తరఫు వారు. తీరా పెళ్లాయ్యాక చిన్న చిన్న గొడవలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దానికి నేటి సమాజ పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. కాలం మారింది, మనుషుల ఆలోచనలు మారాయి. కుటుంబ వ్యవస్థ కూడా మారుతోంది. ఒకప్పుడు బంధాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత కోరికలను త్యాగం చేసేవారు. ఇప్పుడు వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడానికి బంధాన్ని వదులుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వివాహం నిలవాలంటే ఒకరు మాత్రమే త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛకు గౌరవం, పెద్దలకు మర్యాద, బాధ్యతల్లో భాగస్వామ్యం, సమస్యలపై బహిరంగ చర్చ.. ఇవే బలమైన కుటుంబానికి పునాదులు. పెళ్లి చేసుకోవడం కంటే బంధాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. అయితే, ఆ బంధంలో ఇద్దరికీ గౌరవం, భద్రత, సంతోషం ఉండటం అంతకంటే ముఖ్యం. వీటిన్నింటిలో ఏది సరిగా లేకపోయినా బంధాలు ముక్కలు అవ్వడం ఖాయం.

#marriage life#divorce#newly married#lifestyle#viralnews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి