దసరా పండుగ వేళ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, లోకల్ బ్రాండ్స్, బీర్ల ధరలను టచ్ చేయకుండా కేవలం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ బ్రాండ్స్ స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టేకిలా, వైన్ రకాల గరిష్ఠ రిటైల్ ధరలను సవరించింది. ఈ మేరకు బుధవారం అబ్కారీ శాఖ నూతన ధరల జాబితాను విడుదల చేసింది.సవరించిన ధరల ప్రకారం పలు టాప్ బ్రాండ్ల మద్యం సీసాల రేట్లు భారీగా పెరిగాయి.
ఇదిలాఉండగా, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు సవరించిన నూతన ఎంఆర్పీ (MRP) ధరలకే మద్యం విక్రయించాలని తెలంగాణ అబ్కారీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు తమ దృష్టికి వస్తే షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇదిలాఉండగా, తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరలను సగటున 6 శాతం వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా బ్రాండ్ను పట్టి ఫుల్ బాటిల్ మీద రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచినట్టు సమాచారం.ఈ నెల 12వ తేదీ నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్లో అబ్కారీ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 352 ఫారిన్ బ్రాండ్ల ధరల్ని సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి అనంతరం ఈ ధరల పెంపుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 ప్రారంభంలో మద్యం ధరల సవరణ ప్రతిపాదనల్లో భాగంగా బీరు బాటిల్పై సుమారు రూ. 30 నుండి రూ. 50 వరకు (దాదాపు 15% నుండి 19%) ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇక 2026 మే-జూన్ వేసవి సీజన్, గ్లోబల్ సప్లై లోపాల (గ్లాస్ బాటిల్స్ కొరత) సమయంలోనూ బీర్ల సరఫరా తగ్గడంతో కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపాయి. కాగా, ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని 'ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ' నివేదిక ఆధారంగానే ధర క్రమబద్ధీకరణకు సర్కార్ మొగ్గుచూపింది.


