హైదరాబాద్ నగరంలో ‘టీజే సేఫ్’ అధికారులు ఎన్ని దాడులు చేసినా హోటల్స్ నిర్వాహకులు మాత్రం మారడం లేదు. శుభ్రత పాటించకుండా, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కిచెన్‌లో క్లీన్ నెస్ లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం మొదలు, మూతలు లేకుండా వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. కాగా, ఇటీవల కల్తీ మసాలలు, పలుమార్లు వాడిన ఆయిల్ వినియోగం పెరిగిపోయినట్టు అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు.
ఈ క్రమంలోనే నగరంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో 4 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేశారు. మొత్తంగా 13 హోటల్స్, క్యాంటీన్స్‌లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. ఆయా హోటల్స్‌లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారాన్ని టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు.దీంతో నాలుగు సంస్థల FSSAI లైసెన్స్‌లు రద్దు చేశారు. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.
లైసెన్సులు రద్దయిన హోటల్స్‌లో ఎన్నార్ నందిని సుధా – చిక్కడపల్లి, సాయి దర్శిని – వెంగల్రావు నగర్, యూనివర్సల్ రెస్టారెంట్ – వెంగల్రావు నగర్, హర్ష డీలక్స్ మెస్ – అమీర్‌పేట ఉన్నాయి.అపరిశుభ్ర వంటగదులు, ఆహార వ్యర్థాలు, నిల్వ ఉన్న నీటిని గుర్తించిన అధికారులు వాటిల్లో క్వాలిటీ చెక్ నిర్వహించారు. ఆహార కల్తీ అనుమానంతో మొత్తం 16 నమూనాల సేకరించారు.
ఇదిలాఉండగా, FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న పద్మశ్రీ క్యాంటీన్‌ను మూసివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని అబ్సల్యూట్ బార్బెక్యూకు ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇచ్చినట్టు సమాచారం. మరో 7 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నగరంలోకి హోటల్స్ క్వాలిటీ మెయింటెన్ చేస్తున్నాయా? లేదా అని తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టు టీజీ సేఫ్ అధికారులు తెలిపారు.
విస్తృతంగా దాడులు..
నగరంలో గత కొన్ని నెలలుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (TG SAFE) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. వందలాది హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించగా అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.గత మూడు నెలల్లో నగరవ్యాప్తంగా దాదాపు 200 కంటే ఎక్కువ హోటళ్లలో విస్తృత తనిఖీలు జరగ్గా, నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించిన సుమారు 30కి పైగా ప్రముఖ రెస్టారెంట్ల/ఆహార కేంద్రాల లైసెన్సులు రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.


