తెలంగాణ

TG : భారీగా పడిపోయిన సింగరేణి లాభాలు.. నేడు బీఆర్ఎస్ కార్మిక గర్జన

రచన: Kumar••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సింగరేణి సంస్థ లాభాలు నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన సంస్థ ఈ ఏడాది భారీ రాబడిని కోల్పోయింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సింగరేణి సంస్థ లాభాలు నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన సంస్థ ఈ ఏడాది భారీ రాబడిని కోల్పోయింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సింగరేణి నిధులను ఇతర అవసరాల కోసం మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సింగరేణి లాభాలు 72.6 శాతం పతనం అయినట్టు తెలుస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,754 కోట్లకే లాభాలు పరిమితం అయినట్టు సమాచారం. 2024-25లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.6,394 కోట్లు ఆర్జించిన సంస్థ..ఈ ఏడాదిలోనే రూ.4,640 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఒక్క ఏడాదిలో ఇంతభారీ మొత్తంలో సింగరేణి లాభాలు తగ్గడానికి గల కారణాలు చెప్పాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. గత నాలుగేళ్లలోనే అత్యల్ప వార్షిక లాభం రావడానికి కారణాలు ఏమై ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రూ.37 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు టర్నోవర్ పడిపోయినట్టు విమర్శలొస్తున్నాయి.‌ నెలకు రూ.1,000 కోట్ల చొప్పున బకాయిలు పేరుకుపోతున్నాయని.. జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన బకాయిలపై సర్కార్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ బకాయిల పేమెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

దీనికి తోడు సింగరేణి నిధులను ఇతర అవసరాలకు మళ్లించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.ఓబీ టెండర్లు, డిటోనేటర్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. సోలార్‌ ప్లాంట్లు, భారీ యంత్రాల కొనుగోళ్లపై కూడా పలు ప్రశ్నలను బీఆర్ఎస్ లేవనెత్తుతోంది.సింగరేణి ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమీక్ష చేపట్టాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లాభాల బోనస్ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 39 బొగ్గు గనులను (బావులను) నడిపిస్తోంది. రాష్ట్రంలో 38 గనులు ఉండగా.. భూగర్భ గనులు 22, ఓపెన్‌కాస్ట్ గనులు 17 ఉన్నాయి. ఇటీవల ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి దక్కించుకున్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ కార్మిక గర్జన..

కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ నేడు గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ ‘సింగరేణి కార్మిక గర్జన’ సభను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానున్నారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు 30 వేల మంది కార్మికులు హాజరవుతారని అంచనా. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఈ సభా వేదికగా కేటీఆర్ ప్రశ్నించనున్నారు.రామగుండం, మంథని, శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి కార్మికులు తరలిరానున్నట్టు తెలుస్తోంది.

#singareni#SCCL#profits down#Godavarikhani#KTR#BRS#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి