తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే.అయితే, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రానికి మంజూరైన ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను అనుసంధానించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు పీఎం ఆవాస్ యోజన (PMAY) అధికారిక పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ తర్వాత రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న మరో 25 వేల మంది లబ్ధిదారులను కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకురానున్నారు.
అనుసంధాన ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కోటా ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల సాయంతో పాటు రూ.72,000 నిధులు జమ కానున్నాయి. అయితే, పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 2 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఒక్కో ఇంటి నిర్మాణం కోసం కేంద్రం రూ.72 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సొంత భూమి ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థికసాయం అందజేస్తోంది.రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని పూర్తిగా 100 శాతం సబ్సిడీగా అందిస్తోంది. మొదటి విడతలో బేస్మెంట్ స్థాయికి – రూ.లక్ష, రెండో విడతలో రూఫ్/గోడల వరకు మరో రూ.లక్ష, మూడో విడతలో స్లాబ్ వరకు రూ.2 లక్షల సాయం, నాలుగో విడతలో ఇల్లు పూర్తయ్యాక రూ.లక్ష చెల్లించనున్నారు. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా మరో రూ. 12,000 కూడా అందుతాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన PMAY స్కీంతో అనుసంధానించడం వలన ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.72,000 అందుతాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలతో ఇళ్లు పూర్తిగా నిర్మాణం జరగడం లేదని ఫిర్యాదులు వస్తుండగా.. వారికి కేంద్రం అందించే ఆర్థిక సాయం కొంత ఊరట కల్పించనుంది. కాగా, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే పీఎంఏఐ కింద ఆర్థిక సాయం అందనుంది. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ టవర్స్కు ఇది వర్తించదు.


