పరీక్ష రోజే క్వశ్చన్ పేపర్ రెడీ..
లీకేజీలకు ఏఐతో చెక్!
నందన్ నీలేకని మాస్టర్ ప్లాన్!
ఏఐతో కొత్త పరీక్షల విధానం!
పరీక్ష జరిగే రోజే ప్రశ్నపత్రం సిద్ధం చేస్తే..? పేపర్ లీక్ చేసే అవకాశం తగ్గుతుందా? భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి చివరి నిమిషంలో ప్రశ్నలను ఎంపిక చేసే విధానంతో పరీక్షల నిర్వహణలో కొత్త అధ్యాయం మొదలవుతుందా? పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న నందన్ నీలేకని వ్యాఖ్యలు ఇప్పుడు విద్యా రంగంలో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రశ్నపత్రాల తయారీ సాధ్యమేనన్న సంకేతాలు.. పరీక్షల వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయవచ్చనే అంచనాలను పెంచుతున్నాయి.
ఇక చివరి నిమిషంలోనే ప్రశ్నపత్రం!
ప్రశ్నపత్రాల లీకేజీ.. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. ఏళ్ల తరబడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఒక్క లీకేజీతో ప్రశ్నార్థకంగా మారుతోంది. పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించాల్సి రావడం, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావడం.. ఇలా ఈ సమస్య ప్రభావం ఒక్క పరీక్షకే పరిమితం కావడం లేదు.
అయితే, ఈ సమస్యకు పరిష్కారం పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పెంచడమేనా? ప్రశ్నపత్రాలను తరలించే వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడమేనా? లేక ప్రశ్నపత్రాన్ని తయారు చేసే విధానాన్నే మార్చేయాలా? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న నందన్ నీలేకని ఈ దిశగా ఆసక్తికరమైన ఆలోచనను తెరపైకి తెచ్చారు. ముందుగానే ఒక ప్రశ్నపత్రాన్ని తయారు చేసి భద్రపరచడానికి బదులుగా.. భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి పరీక్షకు కొద్దిసేపటి ముందు ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానం లీకేజీలను అరికట్టేందుకు ఒక మార్గమని ఆయన సూచించారు.
దిల్లీలో జరిగిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026లో మాట్లాడిన ఆయన.. పరీక్ష జరిగే రోజే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో క్వశ్చన్ పేపర్ రూపొందించగలమా? అన్న ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు.
ఇక్కడే అసలు ఆసక్తికరమైన అంశం ఉంది. ప్రశ్నపత్రాన్ని ముందుగానే సిద్ధం చేసి, దాన్ని అత్యంత రహస్యంగా ఉంచే పాత పద్ధతికి బదులుగా.. ప్రశ్నలను ఎంపిక చేసి, అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా పరీక్ష పేపర్‌ను చివరి నిమిషంలో రూపొందించే విధానం సాధ్యమవుతుందా? ఇదే ఆలోచనకు కేంద్రబిందువు.
ఏఐ చేతిలో క్వశ్చన్ బ్యాంక్.. ఎలా పనిచేస్తుంది?
ఒక పరీక్షకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలు, క్వశ్చన్ లెవల్స్, మార్కుల పంపిణీ వంటి వివరాలతో ఒక భారీ డిజిటల్ క్వశ్చన్ బ్యాంక్ ఉందని అనుకుందాం. అందులో వేల సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. ఏఐ ఆధారిత వ్యవస్థకు సిలబస్, మార్కుల విభజన, సులభమైన ప్రశ్నలు, మధ్యస్థ స్థాయి ప్రశ్నలు, క్లిష్టమైన ప్రశ్నలు వంటి ప్రమాణాలను ముందుగానే ఇచ్చే అవకాశముంది.
పరీక్షకు ముందు ఈ ప్రమాణాల ఆధారంగా ఏఐ ప్రశ్నలను ఎంపిక చేసి, వాటిని ఒక క్రమంలో పెట్టి ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. అవసరమైతే ప్రశ్నల నాణ్యత, సిలబస్‌కు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలను కూడా పరిశీలించేలా టెక్నాలజీ ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు.. ఒక పరీక్షలో 100 మార్కులు ఉంటే, ఏ అంశం నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు రావాలి? ఎన్ని ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉండాలి? ఎన్ని ప్రశ్నలు ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించాలి? అనే ప్రమాణాలను వ్యవస్థకు అందించవచ్చు. అప్పుడు ఏఐ కేవలం ప్రశ్నలను తయారు చేయడమే కాకుండా, పరీక్షలో అన్ని ముఖ్యమైన అంశాలకు తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రశ్నపత్రం రూపొందించడంలోనూ సహాయపడుతుంది.
పేపర్ లీకేజీకి నిజంగానే చెక్ పడుతుందా?
ఇప్పటి వరకు అనేక పరీక్షల్లో ప్రశ్నపత్రం తయారీ, ప్రింటింగ్, ట్రాన్స్ పోర్ట్, పరీక్ష కేంద్రాలకు పంపిణీ వంటి దశల్లో కాపాడటం అత్యంత కీలకం. ఈ ప్రక్రియలో ఎక్కడైనా భద్రతా లోపం తలెత్తితే లీకేజీకి అవకాశం ఏర్పడుతుంది.
అయితే, పరీక్షకు చాలా ముందుగానే ఒకే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి ఉంచాల్సిన అవసరం తగ్గితే.. దాన్ని లీక్ చేసేందుకు ప్రయత్నించే వ్యక్తులకు అవకాశాలు తగ్గవచ్చు. పరీక్షకు కొద్దిసేపటి ముందు సురక్షితమైన వ్యవస్థ ద్వారా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తే, లీకేజీకి అందుబాటులో ఉండే సమయాన్ని కూడా తగ్గించవచ్చు.
ఏఐతో సమస్యలే రావా..?
ఎందుకు రావు..? ఏఐతో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికే ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తున్నాం. క్వశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలు ముందుగానే బయటకు వెళ్తే? ఏఐ వ్యవస్థలోకి ఎవరైనా అనధికారికంగా ప్రవేశిస్తే? ప్రశ్నపత్రాన్ని రూపొందించే కంప్యూటర్ వ్యవస్థలో భద్రతా లోపాలు ఉంటే? డిజిటల్ సమాచారాన్ని దొంగిలిస్తే? ఇలాంటి ప్రమాదాలు కూడా కొత్త రూపంలో ఎదురుకావచ్చు.
అందుకే టెక్నాలజీతో పాటు బలమైన సైబర్ భద్రత, లిమిటెడ్ యాక్సెస్, నిరంతర నిఘా, రెగ్యులర్ చెకింగ్స్ కూడా అవసరం. ఏఐ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. కానీ ఆ వ్యవస్థను సురక్షితంగా నిర్వహించాల్సిన బాధ్యత మాత్రం పరీక్షల నిర్వహణ సంస్థలదే.
ఏఐ క్వశ్చన్ పేపర్ తో విద్యార్థులకు న్యాయం జరుగుతుందా?
లీకేజీలను అరికట్టడం ఒక అంశమైతే.. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా పరీక్షలను నిర్వహించడం మరో కీలకమైన అంశం. ఒకే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రశ్నపత్రం స్థాయి ఒకేలా ఉండాలి. ఒకరికి ఈజీ పేపర్, మరొకరికి టఫ్ పేపర్ వస్తే అది వారి ప్రతిభను సమానంగా అంచనా వేయదు.
ఏఐ బేస్డ్ ప్రశ్నపత్రాల తయారీలో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది కీలకం. ప్రశ్నల స్థాయి, సిలబస్ కవరేజీ, మార్కుల పంపిణీ, ప్రశ్నల క్వాలిటీ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి.
వేర్వేరు ప్రశ్నపత్రాలను రూపొందించినా వాటి స్థాయి సమానంగా ఉండేలా శాస్త్రీయ పద్ధతులు అవసరం. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో చిన్న తేడా కూడా విద్యార్థుల ర్యాంకులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అలాగే ఏఐ రూపొందించిన ప్రశ్నల్లో తప్పులు, అస్పష్టతలు, ఒకే ప్రశ్నకు అనేక సమాధానాలు ఉండే పరిస్థితులను గుర్తించేందుకు ఎక్స్ పర్ట్స్ తనిఖీ అవసరం. టెక్నాలజీని ఉపయోగించాలంటే.. దాని నిర్ణయాలను పరీక్షించే బాధ్యతాయుతమైన వ్యవస్థ కూడా ఉండాలి.
అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా మారతాయా?
నందన్ నీలేకని వ్యాఖ్యల్లో మరో ముఖ్యమైన అంశం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT). అన్ని పరీక్షలను ఈ విధానంలోకి మార్చే అంశాన్ని కూడా తమ టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ప్రశ్నపత్రాల డిజిటల్ నిర్వహణ, పరీక్షా ప్రక్రియలో వేగం, ఎవాల్యుయేషన్ లో ఆటోమేషన్ వంటి ప్రయోజనాలు సాధ్యమవుతాయి. ఏఐ ఆధారిత ప్రశ్నపత్రాల తయారీని కూడా ఇలాంటి డిజిటల్ వ్యవస్థతో అనుసంధానించే అవకాశం ఉంటుంది.
అయితే, దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలను కంప్యూటర్ల ద్వారా నిర్వహించడం అంత సులభం కాదు. పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, స్థిరమైన విద్యుత్ సరఫరా, టెక్నికల్ సిబ్బంది, నెట్‌వర్క్ భద్రత వంటి సదుపాయాలు అవసరం. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం.
అందువల్ల, కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మార్పు జరిగినా.. దానికి తగిన మౌలిక సదుపాయాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పాటించాల్సిన విధానాలు స్పష్టంగా ఉండాలి.
నీలేకని నివేదికలో ఇదే కీలక ప్రతిపాదన అవుతుందా?
పరీక్షల సంస్కరణల కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు నందన్ నీలేకని నాయకత్వం వహిస్తుండటంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది. పరీక్షల వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, సాంకేతిక పరిష్కారాలతో వాటిని సరిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. తమ కమిటీ ఈ వ్యవస్థాపరమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతోందని తెలిపారు.
తమ సూచనలను అమలు చేయడానికి ప్రధానమంత్రి ఆసక్తిగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ రూపొందించడం, ఏఐ వినియోగం, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వంటి అంశాలు భవిష్యత్తు సంస్కరణల్లో ఎంత ప్రాధాన్యం పొందుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక పరీక్షల భవిష్యత్తు మారబోతోందా?
ఒకప్పుడు ప్రశ్నపత్రం తయారీ అంటే నిపుణులు ప్రశ్నలను రూపొందించడం, వాటిని ఎంపిక చేయడం, ప్రింటింగ్, అత్యంత రహస్యంగా పరీక్ష కేంద్రాలకు చేర్చడం. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధితో ఆ ప్రక్రియలోని కొన్ని దశలను డిజిటల్ వ్యవస్థలతో మార్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
భవిష్యత్తులో ఏఐ ప్రశ్నల ఎంపికలో సహాయపడటం, క్వశ్చన్ పేపర్లను నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడం, ప్రశ్నల నాణ్యతను తనిఖీ చేయడంలో తోడ్పడటం సాధ్యమవుతుంది. అయితే, ప్రశ్నల నాణ్యత, విద్యార్థులకు సమాన న్యాయం, పరీక్షల భద్రత వంటి అంశాల్లో మనుషుల పర్యవేక్షణ కీలకంగానే ఉంటుంది.
అసలు లక్ష్యం ఏఐతో ప్రశ్నపత్రాలు తయారు చేయడమే కాదు. పరీక్ష రాసే విద్యార్థికి ముందుగానే ప్రశ్నలు చేరకుండా చూడటం.. అర్హత ఉన్న విద్యార్థికి అన్యాయం జరగకుండా చూడటం.. పరీక్షలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం.


