ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యమాలకు, ఉద్యమ పార్టీలకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ఉద్యమాలు, ఆ ఉద్యమాలు చేసే పార్టీలు సొంతంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.. ఒక పార్టీ అధికారం సొంతం చేసుకోవాలంటే వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం వేరు.. ఎలాగో అధికారంలోకి వచ్చాక అందరినీ తనలో కలిపేసుకుని నోరెత్తకుండా చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం..
కానీ ప్రస్తుతం దేశ రాజకీయాలు కాంగ్రెస్ చుట్టూ కాకుండా బొద్దింకల చుట్టూ తిరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. బీజేపీని పడగొట్టాలంటే కాంగ్రెస్ ఎత్తులు సరిపోవడం లేదని.. ఇది వరకు ఇండియా కూటమి అని ఏర్పాటు చేసి నవ్వులపాలైన హస్తం ఇప్పుడు బొద్దింకలను అడ్డుపెట్టుకుని కొత్త రాజకీయాలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడే పరిస్థితి వచ్చిందనే సామెత గుర్తుకు వచ్చేలా CJP వ్యవహారం సాగుతుందనే అభిప్రాయాలు సొంత పార్టీ వర్గాలలో మొదలైనట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకత్వానికే CJP దూకుడు, పోటీగా నిలుస్తుందా అన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది CJP ఎదుగుదల అని అంటున్నారు.. నీట్ పరీక్షల వివాదంతో ప్రారంభమైన యువజన ఉద్యమం.. ఆ తర్వాత ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల అంశాల వరకు విస్తరించింది. ఈ క్రమంలో CJP పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసేందుకు కాంగ్రెస్కు ఉన్న రాజకీయ వేదికలు, ఇప్పుడు యువత నేతృత్వంలోని ఉద్యమాల ద్వారా కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఆ ఉద్యమాల వల్ల ఏర్పడుతున్న ప్రజా మద్దతు మాత్రం ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కావడం లేదు.
ఇక్కడే కాంగ్రెస్కు అసలు సవాల్ ఎదురవుతోంది.
రాహుల్ గాంధీ ఓటర్ల హక్కులు, ఎన్నికల అక్రమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. కానీ అదే అంశాలపై CJP కూడా నిరసనలు చేపడుతూ, యువతను సమీకరిస్తోంది. ఒకే సమస్యపై రెండు వేర్వేరు వేదికల నుంచి పోరాటం జరుగుతున్నప్పుడు.. సాధారణంగా ప్రజల దృష్టిలో ఎవరి పోరాటం ఎక్కువగా కనిపిస్తుంది? ఎవరు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారనే భావన ఏర్పడుతుంది?..
ఈ పరిణామాల నేపథ్యంలోనే CJPకి మద్దతుగా నిలవాలా? దూరంగా ఉండాలా? అనే అంశం పై కాంగ్రెస్లోనూ చర్చ సాగుతోంది. అక్టోబర్లో CJP చేపట్టిన నిరసనలకు దూరంగా ఉంటూనే, కాంగ్రెస్ తన సొంత ఆందోళనలను నిర్వహించింది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాల వంటి ఇండియా కూటమి భాగస్వాములు CJP ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ప్రతిపక్షాల మధ్య వ్యూహాత్మక భేదాలను బయటపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు..
ఉద్యమాల వల్ల CJP ఎక్కువ ప్రచారం
ప్రభుత్వంపై పోరాటం చేయడంలో విపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ పోరాటానికి నాయకత్వం ఎవరు వహించాలనే అంశంలో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయని చెప్పుకొంటున్నారు. రానున్న కాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే, కాంగ్రెస్ మద్దతుతో ముందుకు వచ్చిన ఉద్యమాల వల్ల CJP ఎక్కువ ప్రచారం సంపాదించుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఎందుకంటే సంప్రదాయ రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, సంస్థాగత బలం, పార్లమెంటరీ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. యువతను ఆకర్షించే స్వతంత్ర ఉద్యమాలకు మరో రకమైన గుర్తింపు ఉంటుంది. వాటిపై ప్రజల్లో ఏర్పడే ఆసక్తి, రాజకీయ పార్టీలపై ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా ఉండవచ్చు. అయితే CJPని కాంగ్రెస్ సృష్టించిందని, లేదా బీజేపీ ప్రణాళిక ప్రకారమే ఈ ఉద్యమం సాగుతోందని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం బహిరంగంగా కనిపించడం లేదు.. కాబట్టి వేరే ఆలోచనల ఆస్కారమే లేదని అంటున్నారు..
అలాగే CJP తనను స్వతంత్ర ఉద్యమ వేదికగా పేర్కొంటోంది. మరోవైపు, బీజేపీ మాత్రం CJP ప్రతిపక్ష కూటమి వల్ల ఎదురవుతున్న సమస్యల నివారణ పై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేలా ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తుంది.
స్పష్టంగా కనిపిస్తున్న అవకాశం.. బీజేపీకి కలిసివచ్చే రాజకీయం
ఒకవేళ కాంగ్రెస్, CJP మధ్య విభేదాలు పెరిగితే.. ప్రభుత్వంపై వచ్చిన విమర్శల నుంచి దృష్టి ప్రతిపక్షాల పోటీపైకి మళ్లుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ను ఒకవైపు, స్వతంత్ర యువజన ఉద్యమాన్ని మరోవైపు చూపిస్తూ.. ప్రతిపక్షాల ఐక్యతపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.. ఇప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్ నిరసనలను విమర్శిస్తూ, రాహుల్ గాంధీ రాజకీయాలపై ఎదురుదాడి చేస్తున్న విషయం తెలిసిందే..
ఇక రాజకీయం అంటేనే ఎత్తులకు పై ఎత్తులు.. సరైన సమయంలో అందుకునే అవకాశం ఆ పార్టీని మనుగడకు పునాదిగా మారుతుంది. ఉదాహరణ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ని చెప్పుకోవచ్చు.. ఒక చిన్న ఉద్యమ పార్టీగా మొదలై చివరికి తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళడం అందరికీ తెలిసిందే.. అందుకే బొద్దింకల ఎదుగుదలని కూడా తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక CJP ఎదుగుదల వల్ల కాంగ్రెస్ కు రాజకీయ ప్రాధాన్యం తగ్గినట్టు కనిపించే పరిస్థితి ఏర్పడితే, ఆ పరిణామాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇదే ఈ రాజకీయ సమీకరణంలో కీలకమైన అంశంగా చెబుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ తన సొంత ఉద్యమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుంది.. CJPతో కలిసి ఎలా ముందుకు వెళ్తుంది. యువతను ఆకర్షించే రాజకీయ కార్యక్రమాల్లో తన పాత్రను ఎలా నిరూపించుకుంటుందన్న అంశాలే కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించనున్నాయి.
ఎందుకంటే రాజకీయాల్లో ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆ ఉద్యమం ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించడం మరో ఎత్తు. ఒక పార్టీ ప్రారంభించిన పోరాటానికి మరొక వేదిక ఎక్కువ ప్రచారం సంపాదించుకుంటే, చివరకు రాజకీయ క్రెడిట్ మాత్రం ప్రజల్లో నిత్యం నిలిచే పార్టీకే దక్కుతుందనేది గతంలో నిరూపితమైంది. అందుకే CJP విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
ఆ ఉద్యమం స్వతంత్రంగా ఎదిగి, కాంగ్రెస్ కంటే ఎక్కువ ప్రజా గుర్తింపు సంపాదించుకుంటే.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అంశాల రాజకీయ క్రెడిట్లో కొంత భాగం CJPకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. అదే సమయంలో, ఈ పరిణామాల నుంచి బీజేపీ ఎంతవరకు రాజకీయ ప్రయోజనం పొందుతుందనేది కూడా ప్రతిపక్షాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా.. CJP ఎదుగుదల కాంగ్రెస్కు ఒక కొత్త సవాల్ను విసురుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వం, యువత మద్దతు, ఉద్యమాలపై రాజకీయ ఆధిపత్యం.. ఈ మూడు అంశాల చుట్టూ జాతీయ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి..


