ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన మీద గతంలో నమోదైన సీబీఐ, ఈడీ కేసులను ఇకమీదట రోజువారీగా విచారించాలని హైదరాబాద్లోని నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్ణయించింది. వైఎస్ జగన్తో పాటు నిందితులందరినీ వ్యక్తిగతంగా విచారించాలని ఈ సందర్బంగా న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, దశాబ్దకాలంగా ఈ కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన సత్వర విచారణ హక్కు ప్రకారం, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించాలని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టులో బలంగా వాదించారు.
కుట్రలు, భారీగా ప్రజాధనం లూఠీ వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఈ కేసులను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసినట్టు ఈడీ తన వాదనల్లో పేర్కొంది.దీంతో నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసుల విచారణను వేగవంతం చేస్తూ జగన్తో పాటు సంబంధిత నిందితులందరూ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా చూడాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘క్విడ్ ప్రో కో’ కింద పెట్టుబడులు రాబట్టారని, ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి పలు కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రభుత్వ భూములు, మైనింగ్ లీజులు, ప్రాజెక్టులు,ఇతర రాయితీలను కేటాయించారనేది ప్రధాన ఆరోపణ.దానికి ప్రతిఫలంగా ఆయా కంపెనీలు/వ్యక్తులు జగన్కు చెందిన వ్యాపార సంస్థల్లో (భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ - సాక్షి మీడియా మొదలైనవి) భారీ ప్రీమియం ధరలకు షేర్లను కొనుగోలు చేస్తూ రూ.వందల కోట్లు పెట్టుబడులు పెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.ఈ మేరకు కేసులు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించగా.. జగన్ సీఎం కాకముందు విచారణ తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆయన సీఎం అయ్యాక అసలు విచారణ జరగలేదు. తాజాగా ఈసీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.


