తెలంగాణ

HCA : ఉప్పల్ వేదికగా హెచ్‌సీఏ బాగోతం.. మళ్లీ పాత దందాయేనా?

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఒక పండుగ. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగబోతోంది. స్థానిక కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.

HCA : హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఒక పండుగ. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగబోతోంది. స్థానిక కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరు పాత కథనే గుర్తుచేస్తోంది. పారదర్శకత లేని విధానాలతో, ఎవరికీ తెలియని సరికొత్త యాప్‌ను తెరపైకి తెచ్చి క్రికెట్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

అసలు మతలబు ఏంటి?

ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం సుమారు 39 వేలు కాగా, 10 శాతం కాంప్లిమెంటరీ పాసులు మినహాయిస్తే మిగిలిన 34 వేల టికెట్లను అభిమానులకు విక్రయించాలి. గతంలో జరిగిన మ్యాచ్‌లకు బుక్‌మైషో, లేదా ఐపీఎల్ సమయంలో డిస్ట్రిక్ట్ బై జొమాటో వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్‌లలో టికెట్లు అమ్మేవారు. ఎవరైనా ముందుగా లాగిన్ అయితే క్యూలో ఉండి టికెట్ పొందే అవకాశం ఉండేది.

కానీ ఈసారి హెచ్‌సీఏ ఎవరికీ పరిచయం లేని 'టికెట్ జనీ' అనే యాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7, అక్టోబర్ 9 తేదీల్లో సాయంత్రం 6:30 గంటలకు రెండు విడతల్లో టికెట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పింది. తీరా ఆ సమయానికి సంబంధిత యాప్‌ను తెరిచి చూసిన అభిమానులకు నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ ఔట్’ బోర్డు కనిపించింది. అసలు ఆ యాప్‌లో ఎన్ని టికెట్లు పెట్టారు? ఎవరికి అమ్మారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

దూర ప్రాంతాల నుంచి వచ్చి రోడ్డున పడ్డ ఫ్యాన్స్!

ఆన్‌లైన్‌లో టికెట్లు దొరక్కపోవడంతో కనీసం స్టేడియం వద్ద ఆఫ్‌లైన్ కౌంటర్లు ఏమైనా ఉంటాయేమోనని విశాఖపట్నం సహా సుదూర ప్రాంతాల నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకుని వచ్చిన అభిమానులు ఉప్పల్ గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యక్షంగా తమ అభిమాన ఆటగాళ్లను చూడాలన్న ఆశతో చివరికి బ్లాక్ మార్కెట్ మాఫియాను ఆశ్రయించడానికైనా సిద్ధపడుతున్నామని ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. 34 వేల టికెట్లు నిజంగా సాధారణ ప్రజల కోసమే కేటాయించారా లేక లోపాయికారీగా వీఐపీలకు, బ్లాక్ దందాకు మళ్లించారా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

వివాదాల హెచ్‌సీఏ.. మ్యాచ్‌లు ఇవ్వడానికి బీసీసీఐ ససేమిరా

హెచ్‌సీఏకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో టికెట్ల అక్రమ అమ్మకాలు, అవినీతి ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు కావడం, మాజీ అధ్యక్షుడి అరెస్ట్ వరకు ఎన్నో చీకటి కోణాలు వెలుగుచూశాయి. గత ఐపీఎల్ సీజన్‌లోనూ అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారన్న ఆరోపణలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి. ఈ వరుస అక్రమాల కారణంగానే ఉప్పల్ స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించడానికి బీసీసీఐ వెనకాడుతోందన్నది కాదనలేని నిజం.

ఇప్పటివరకు ఉప్పల్ వేదికగా కేవలం మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత దక్కిన ఈ అవకాశాన్ని కూడా హెచ్‌సీఏ సద్వినియోగం చేసుకోలేకపోతోంది. టికెట్ల నిర్వహణలో పారదర్శకత చూపించకపోతే హైదరాబాద్‌కు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

#HCA#Hyderabad Cricket Association#HCA Ticket Controversy#Hyderabad Cricket#India vs West Indies#T20 Match#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి