GO 17: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విరుచుకుపడ్డారు. పాత రోజులు తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తన మాట నిలబెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు బాధలు తెచ్చింది అంటూ నిప్పులు చెరిగారు. ఏపీలో కృష్ణా నీళ్లు పుష్కలంగా పారుతున్నాయన్న హరీశ్ రావు.. రేవంత్ వదిలిన నీటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిసి పెట్టారని చెప్పారు.
24 గంటల ఉచిత విద్యుత్కు ఉరి
ప్రభుత్వం చేతకానితనం వల్ల, కరెంటు ఇవ్వకపోవడం వల్ల, కృష్ణా నదిలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఇవాళ పాలమూరుకు రేవంత్ రెడ్డి పేరిట గ్రహణం పట్టిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇక రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ 17పై తీవ్రంగా స్పందించారు హరీశ్ రావు. జీవో నెంబర్ 17తో రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసిందన్నారు.
7-8 గంటలకు మించి కరెంటు ఇవ్వరు
''కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 17 ఇచ్చింది. దీంతో ఒక స్పష్టత వచ్చింది. 24 గంటల కరెంటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసింది. ఆ ఉరే జీవో నెంబర్ 17. రైతు డిస్కం అని కొత్త డిస్కం పెట్టారు. ఇప్పటి నుంచి రైతులకు కరెంటు రైతు డిస్కమే ఇస్తుందట. మరి రైతు డిస్కంకు ఏ కరెంటు కేటాయించారు? అంటే.. సోలార్ పవర్ కేటాయించారు. సోలార్ పవర్ ఎప్పుడొస్తుంది. పొద్దున 7 గంటలకు వస్తుంది. సాయంత్రం 4 గంటలకు పోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 7-8 గంటలకు మించి కరెంటు ఇవ్వము అని నిన్న జీవో నెంబర్ 17 ఇచ్చింది. జీవో నెంబర్ 17తో ఒకటి స్పష్టమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ కు మంగళం పాడింది. ఇక రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వదని తేల్చేసింది.
రైతులంటే మీకు ఎందుకు చిన్నచూపు?
రేవంత్ రెడ్డి సంతకంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే జీవో నెంబర్ 17. ఇక రాబోయే రోజుల్లో రైతుకు రాత్రిపూట కరెంటు రాదు. కేసీఆర్ ఇచ్చినట్లు 24 గంటల కరెంటు ఇవ్వరు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే దాన్ని ఎందుకు సోలార్ పవర్ కే పరిమితం చేశారు? ఎందుకు 6-7 గంటల కరెంటుకే రైతును పరిమితం చేశారు? రైతులంటే మీకు ఎందుకు చిన్నచూపు? రైతులు అనగానే కోతలు ఎందుకు పడుతున్నాయి? రైతు బీమా బంద్ పెట్టారు. 3 పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు. ఇప్పుడు 24 గంటల కరెంటును 6-7 గంటలకే కుదించారు. రైతు అంటే రేవంత్ రెడ్డికి బాధ్యత లేదు.
ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకొచ్చింది?
ఏపీ సీఎం చంద్రబాబు 700 కిలోమీటర్లు కృష్ణా నది నీళ్లు తీసుకుపోయి కుప్పంలో పారించుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలో నీళ్లు పారుతున్నాయి. ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకొచ్చింది? ఏపీకి తెలంగాణ నుంచే నీళ్లు పోవాల్సింది. గోదావరి నీళ్లు అయినా కృష్ణా నీళ్లు అయినా.. తెలంగాణ ఒడిసిపడితే కిందకు నీళ్లే పోవు. రేవంత్ రెడ్డి విడిచిపెట్టారు కాబట్టే ఇవాళ చంద్రబాబు ఒడిసిపడుతున్నారు. 700 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోయి పారిస్తున్నారు.
ప్రభుత్వం వైఫల్యం వల్లే కరువు
పక్కనే కృష్ణమ్మ ఉన్నా మా దగ్గర నీళ్లు లేవు. ఇవాళ నీళ్లు ఉన్నా రేవంత్ రెడ్డి కరెంటు ఇవ్వకపోవడం వల్ల పొలాలు బీడు పడుతున్నాయి. మిరప తోటలు, పత్తి పంట ఎక్కడికక్కడ ఎండిపోయాయి. రైతులు చాలా బాధలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉల్టా మాట్లాడుతున్నారు. ఎల్ నినో వచ్చింది, కరువు వచ్చిందని ప్రజలను భయపెడుతున్నారు. ఎల్ నినో వల్ల కరువు రాలేదు. రేవంత్ ప్రభుత్వం వైఫల్యం వల్లే కరువు వచ్చింది.
నీళ్లు ఉన్నా ఎత్తని చేతకాని ప్రభుత్వం
ఎల్ నినోకు, బొగ్గుకు ఏం సంబంధం? బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. కల్వకుర్తిలో, శ్రీశైలంలో నీళ్లు ఉన్నా 5 మోటార్లు నడపాల్సిన చోట రెండే నడుపుతున్నారు. 24 గంటలు నడపాల్సిన మోటార్లు 8 గంటలే నడుపుతున్నారు. నీళ్లు ఉన్నా ఎత్తని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, కృష్ణాలోనూ నీళ్లు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎత్తకపోవడం వల్ల, నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల కరువు వచ్చింది. రైతాంగానికి కరెంటు సరఫరా సరిగా చేయకపోవడం వల్ల కరువు వచ్చింది'' అంటూ విరుచుకుపడ్డారు హరీశ్ రావు.


