క్రైమ్

Medchal: విలువలు వలువలు వదిలేసిన ఖాకీల కహానీ!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఏసీబీ అధికారులను చూసి ఎస్సై పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కీసర పోలీస్ స్టేషన్‌తో పాటు ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది..

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హద్దులు దాటితే, అక్రమాలకు పాల్పడితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?.. రక్షణ ఇవ్వాల్సిన చేతులే భక్షకులుగా మారితే సమాజంలో శాంతిభద్రతలకు అర్థమేముంటుంది!.. ఒకప్పుడు సేవకు కేంద్రబిందువుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు, నేడు నీకెంత... నాకెంత? అని బేరాలు ఆడే వ్యాపార కేంద్రాలుగా మారిపోవడం అత్యంత విచారకరం. రోజురోజుకూ విచ్చలవిడిగా మారుతున్న ఈ అవినీతి, సమాజ పురోగతికి అతిపెద్ద విఘాతంగా మారింది.

తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో వెలుగుచూసిన ఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. పేదల కడుపు నింపే పీడీఎస్ (PDS) రేషన్ బియ్యం దందాలో ఏకంగా పోలీసులపైనే అవినీతి ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నేరుగా దొంగతనం చేసే అక్రమార్కులు ఒకవైపు అయితే... వారికి సహకరిస్తూ విలువలు, వలువలు వదిలేసిన 'అఫీషియల్ దొంగలు'గా కొందరు ఖాకీలు మారడం ఇక్కడ అసలు కహానీ!..

ఒక కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఏకంగా 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. "ఐదు లక్షలు అంటే లెక్కలేనట్లు మాట్లాడటమే కాకుండా, బాధితుడిని కెమికల్ టెస్టుల పేరుతో ముప్పుతిప్పలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని వేధింపులకు గురిచేశారు. దాంతో చేసేదే లంగా పని... మళ్లీ నన్నే తిడతావా? అని కక్ష గట్టిన బియ్యం వ్యాపారి, నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు.

చివరకు 5 లక్షల రూపాయలకు డీల్ కుదరగా... గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉండగానే ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. కీసర చెరువు వద్ద కారులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ బృందం అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం.. ఏసీబీ అధికారులను చూసి ఎస్సై పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కీసర పోలీస్ స్టేషన్‌తో పాటు ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది..

#Medchal District#Keesara#Police Station#PDS rice#ration rice#bribe
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి