తెలంగాణ

HYD: భాగ్యనగరంలో గణనాథుడి మహిమ.. 10రోజుల్లో రూ.10,000కోట్ల బిజినెస్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక పరవశంతో పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఊహించని స్థాయిలో జవసత్వాలు అందిస్తున్నాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు లేక శూన్యమాసంలో మందగించిన వివిధ వ్యాపారాలకు ఈ పండుగ సీజన్ కొత్త ఊపిరి పోసింది.

 హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక పరవశంతో పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఊహించని స్థాయిలో జవసత్వాలు అందిస్తున్నాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు లేక శూన్యమాసంలో మందగించిన వివిధ వ్యాపారాలకు ఈ పండుగ సీజన్ కొత్త ఊపిరి పోసింది. భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రాథమిక అంచనాల ప్రకారం.. అధికారికంగా రూ.6,000కోట్ల వ్యాపారం అవుతుందని భావించినప్పటికీ, అనధికారికంగా ఈ ఉత్సవాల టర్నోవర్ రూ.10,000 కోట్లను దాటుతుందని ఆర్థిక, వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

 ఈ 1రోజుల పండుగ సీజన్ నగరంలోని లక్షలాది కుటుంబాలకు నేరుగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గణపతి విగ్రహాల తయారీదారులు, డీజే, సౌండ్ సిస్టమ్స్, టెంట్ హౌస్‌లు, లైటింగ్ కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ సర్వీసెస్, బ్యాండ్ మేళాలు, తీన్మార్ డప్పు కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. నగరవ్యాప్తంగా దాదాపు 2లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 4లక్షల మందికి పరోక్షంగా ఈ ఉత్సవాల ద్వారా జీవనోపాధి లభిస్తుండటం విశేషం.

 ఉత్సవాల ఖర్చును పరిశీలిస్తే, ఒక్క విగ్రహాల కొనుగోళ్లు, విక్రయాల వ్యాపారమే రూ.100 కోట్లకు పైగా సాగుతోంది. అదేవిధంగా విగ్రహాల పందిళ్లు, ప్రత్యేక మండపాల అలంకరణ కోసం నిర్వాహకులు దాదాపు రూ.200కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. వీటితో పాటు నిమజ్జన ఊరేగింపుల కోసం ఉపయోగించే లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వంటి రవాణా రంగానికి కూడా భారీ ఆదాయం సమకూరుతోంది. మహారాష్ట్ర తర్వాత దేశంలోనే అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలు జరిగే కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది.

 భక్తులు భక్తిశ్రద్ధలతో ఖర్చు చేసే ప్రతి రూపాయి మార్కెట్‌లో నిరంతరం తిరుగుతూ చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరికీ ఆర్థిక ఊరటనిస్తోంది. అదేవిధంగా స్వామి వారికి సమర్పించే పూలు, పండ్లు, ప్రసాదాల తయారీకి వాడే సరుకులు, మండపం వద్ద ఏర్పాటు చేసే బ్యానర్లు, మైక్ సెట్ల వ్యాపారాలు జోరందుకున్నాయి. ఆధ్యాత్మిక వేడుకగా ప్రారంభమయ్యే గణేశ్ నవరాత్రులు, హైదరాబాద్‌లో ఆర్థిక చక్రం వేగంగా తిరిగేందుకు ఒక బృహత్తర ఉపాధి యజ్ఞంగా ఉపయోగపడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

#HyderabadGaneshUtsav#GaneshChaturthi2026#TelanganaEconomy#GaneshPandalBusiness#HyderabadNews#BusinessNews#EmploymentNews#swechanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి