తెలంగాణ

సామాన్యుడికి వంద గజాలు కరువు.. నాయకులకు వందల ఎకరాలెలా? రేవంత్–కల్వకుంట్ల భూముల యుద్ధం వెనుక లెక్కలేంటి..?

రచన: Kashi12 నిమిషాల పఠనం

తెలంగాణలో ఇప్పుడు మాటల యుద్ధం కాదు... భూముల యుద్ధం మొదలైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం. మధ్యలో వందల ఎకరాల భూముల ఆరోపణలు. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ రగడ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

ఒక్క నాయకుడికి వందల ఎకరాలా..?

సీఎం రేవంత్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్

సామాన్యుల్లోనూ మొదలైన చర్చ

తెలంగాణలో భూం.. ధాం

తెలంగాణలో ఇప్పుడు మాటల యుద్ధం కాదు... భూముల యుద్ధం మొదలైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం. మధ్యలో వందల ఎకరాల భూముల ఆరోపణలు. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ రగడ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. కానీ ఈ మొత్తం వివాదాన్ని కేవలం రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీగా చూస్తే... కథ సగమే కనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద ప్రశ్న ఉంది. సామాన్యుడికి వంద గజాల స్థలం కొనడం ఎందుకంత కష్టం? రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలకు వందల ఎకరాల భూములు ఎలా సమకూరుతున్నాయి? ఇది ఒక్క రాజకీయ కుటుంబాన్ని అడగాల్సిన ప్రశ్న కాదు. ఇది రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని అడగాల్సిన ప్రశ్న.

ఒక మధ్యతరగతి కుటుంబాన్ని అడిగితే సొంత ఇల్లు అనేది ఎంత పెద్ద పోరాటమో చెబుతుంది. స్థలం కొనాలి. లక్షలు, కోట్లు చెల్లించాలి. బ్యాంకు లోన్ కోసం తిరగాలి. రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాలి. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అంటే ఒక చిన్న ఇంటి కోసం ఒక కుటుంబం తన జీవితకాల సంపాదనను ముందుగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కానీ అదే సమయంలో రాజకీయాల్లో ఉన్న కొంతమంది ప్రముఖుల ఆస్తుల గురించి మాట్లాడితే ఎకరాలు, వందల ఎకరాలు అనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఇక్కడే సామాన్యుడి మనసు చివుక్కుమంటుంది. నాకు వంద గజాలు దొరకడం కష్టం... వారికి వందల ఎకరాలు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించాలనిపిస్తుంది.

భూమి ఎక్కువగా ఉండటం ఒక్కటే అక్రమానికి ఆధారం కాదు. అది వారసత్వంగా వచ్చి ఉండొచ్చు. చట్టబద్ధంగా కొనుగోలు చేసి ఉండొచ్చు. వ్యాపారం ద్వారా సంపాదించి ఉండొచ్చు. కాబట్టి అసలు ప్రశ్న ఎంత భూమి ఉంది? అనేది మాత్రమే కాదు. ఆ భూమి ఎలా వచ్చింది? అనేదే కీలకం. ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరి పేరుపై ఉంది? ఎంతకు కొనుగోలు చేశారు? ఆ సమయంలో ఆ వ్యక్తి ఆదాయ వనరులు ఏమిటి? భూమి స్వభావం ఏమిటి? ఏమైనా ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయా? ఇవన్నీ రికార్డులతో తేలాల్సిన ప్రశ్నలు.

రేవంత్ వ్యూహం ఏంటి..?

ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఎందుకు ఇంత బలంగా ముందుకు తీసుకొచ్చారు? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం ఇప్పటికే ఒక ప్రధాన రాజకీయ కేంద్రం. అలాంటి సమయంలో ఆ కుటుంబ ఆస్తులపై ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఆరోపణలు చేయడం సాధారణ పొలిటికల్ కామెంట్ గా చూడలేం. అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ, మొత్తం సుమారు 440 ఎకరాల భూములపై ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి. భూముల వ్యవహారంపై విచారణకు కూడా ఆదేశించారు. రేవంత్ ఒక కుటుంబ ఆస్తులపై ప్రశ్న లేవనెత్తడంతో... తెలంగాణ రాజకీయాల్లో నాయకుల భూముల లెక్క అనే పెద్ద చర్చ మొదలైంది.

రేవంత్ రెడ్డి ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు? బీఆర్ఎస్‌పై రాజకీయ ఒత్తిడి పెంచడానికా? కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి రాజకీయ చర్చలోకి తీసుకురావడానికా? గత ప్రభుత్వ పాలనలో భూముల వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తడానికా? లేక ప్రభుత్వం చెబుతున్నట్టుగా కొన్ని భూ లావాదేవీలపై నిజానిజాలు వెలుగులోకి తీసుకురావడానికా? కారణం ఏదైనా కావచ్చు. కానీ ఫలితం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భూముల లెక్క ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

రేవంత్ ఆరోపణలు చేయగానే బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ కుటుంబ భూములపై మాత్రమే కాదు, రేవంత్ కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తులపై కూడా విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అంటే ఒకరి చేతిలో ఉన్న ఫైల్‌కు మరొకరు కౌంటర్ గా మరో ఫైల్ తీసుకొచ్చారు. ఒకరు మీ భూముల లెక్క చెప్పండి అంటున్నారు. మరొకరు ముందు మీ భూముల లెక్క చెప్పండి అంటున్నారు. ఒకరి ఆస్తులు మరొకరికి రాజకీయ ఆయుధంగా మారుతున్నాయి. ఒకరి భూములు ఇంకొకరికి బౌన్సర్‌గా మారుతున్నాయి.

ప్రజలు ఏమనుకుంటున్నారు..?

ఈ ల్యాండ్ గేమ్ లో ప్రజలు మాత్రం గ్యాలరీలో కూర్చుని చూస్తూ ఉండాలా? రేవంత్ వర్సెస్ కేసీఆర్ కుటుంబం... కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్... ఆరోపణ వర్సెస్ ప్రతిఆరోపణ... ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. కానీ అన్నింటికంటే పెద్ద ప్రశ్న మరోటి ఉంది. రాజకీయంగా ఎదిగిన నాయకుల ఆస్తులపై పూర్తి పారదర్శకత ఎందుకు ఉండకూడదు? ఇది ఒక్క తెలంగాణకే పరిమితం చేయాల్సిన ప్రశ్న కాదు. యావత్ భారతదేశాన్ని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న.

ఒక నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతని ఆస్తులు ఎంత? పదవి చేపట్టినప్పుడు ఎంత? పదవిలో ఉన్న సమయంలో ఎంత పెరిగాయి? పదవి ముగిసే సమయానికి ఎంతకు చేరుకున్నాయి..? ఆస్తుల పెరుగుదలకు ఆదాయ వనరులు ఏమిటి? భూములు ఎప్పుడు కొనుగోలు చేశారు? ఏ ధరకు కొనుగోలు చేశారు? కుటుంబ సభ్యుల పేర్లలో ఎంత ఉంది? వ్యాపార సంస్థల పేర్లలో ఎంత ఉంది? ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తులు, తర్వాతి సంవత్సరాల్లో పెరిగిన ఆస్తులతో ఎంత తేడా ఉంది? ఇవి ప్రజాస్వామ్యానికి సంబంధించిన కనీస ప్రశ్నలు.

ప్రత్యేకంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వందల ఎకరాల భూమి అంటే దాని ఆర్థిక విలువ ఎంత అనేది కూడా పెద్ద ప్రశ్న. ఆ భూముల చరిత్ర ఏంటి? అవి ఎప్పుడు చేతులు మారాయి? భూ రికార్డుల్లో ఏమైనా మార్పులు జరిగాయా? వాటికి ప్రభుత్వ భూములతో ఏమైనా సంబంధం ఉందా? అసైన్డ్ భూముల సమస్య ఉందా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానాలు రాజకీయ ప్రసంగాల్లో కాదు... అధికారిక పత్రాల్లో కనిపించాలి.

ఎందుకంటే ఒక నాయకుడి దగ్గర వంద ఎకరాలు ఉన్నాయంటే అది ఆటోమేటిక్‌గా తప్పు కాదు. చట్టబద్ధంగా సంపాదించిన ఆస్తి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఆ భూమి ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి. అదే అసలు పారదర్శకత. భూమి ఉండటం సమస్య కాదు... భూమి మూలం, లావాదేవీ, చట్టపరమైన పరిస్థితి స్పష్టంగా ఉండటమే ముఖ్యం.

ఇప్పుడు రేవంత్ విసిరిన బాల్ బీఆర్ఎస్ కోర్టులో పడింది. బీఆర్ఎస్ కూడా బంతిని తిరిగి రేవంత్ కోర్టులోకి పంపింది. కానీ ఈ మ్యాచ్‌లో అసలు అంపైర్ ఎవరు? ప్రజలు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక ప్రమాణం పాటించాలి. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా... ఆస్తుల విషయంలో లెక్క ఒకటే ఉండాలి. కాంగ్రెస్ నాయకుడైనా అడగాలి. బీఆర్ఎస్ నాయకుడైనా అడగాలి. బీజేపీ నాయకుడైనా అడగాలి. రాజకీయంగా ప్రభావం ఉన్న ప్రతి నాయకుడి ఆస్తులపై ఒకే రకమైన పారదర్శకత ఉండాలి.

ఎందుకంటే ఇది కల్వకుంట్ల కుటుంబంతో ఆగిపోయే ప్రశ్న కాదు. ఈరోజు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. రేపు రేవంత్ కుటుంబం గురించి మాట్లాడొచ్చు. ఎల్లుండి మరో నాయకుడి కుటుంబం గురించి చర్చ రావచ్చు. అందుకే రాజకీయ నాయకులందరికీ ఒకే ప్రశ్న. మీ దగ్గర ఉన్న భూమి కథ ఏంటి? వారసత్వంగా వచ్చిందా? చెప్పండి. చట్టబద్ధంగా కొనుగోలు చేశారా? చెప్పండి. వ్యాపారంతో సంపాదించారా? చెప్పండి. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా? చూపించండి. చట్టబద్ధమైన ఆస్తి అయితే దానిని వివరించడానికి ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు.

ఎందుకంటే ఒక సామాన్యుడు తన ఇంటి స్థలం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు, అదే రాష్ట్రంలో రాజకీయ కుటుంబాల భూములపై వందల ఎకరాల లెక్కలు వినిపిస్తే ఈ ప్రశ్న రావడం సహజం. ఇది కేవలం ఆస్తుల ప్రశ్న కాదు. ఇది రాజకీయ నైతికతకు సంబంధించిన ప్రశ్న. ప్రజలు తమ ఓటుతో నాయకులను అధికారంలోకి పంపుతారు. ఆ తర్వాత ఆ నాయకుల ఆస్తులపై అనుమానాలు వస్తే సమాధానాలు అడగడం కూడా ప్రజల హక్కే. మా నాయకుడు అంటూ కాపాడే రాజకీయాల కంటే... మా నాయకుడైనా తప్పు చేస్తే లెక్క చెప్పాలి అనే రాజకీయ సంస్కృతి రావాల్సిన అవసరం ఉంది.

చివరికి తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్న చాలా సింపుల్. హైదరాబాద్‌లో వంద గజాల స్థలం కోసం ఒక సామాన్యుడు తన జీవితాన్ని పణంగా పెడుతున్నాడు. భూమి ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఇల్లు కట్టుకోవడం కలగా మారుతోంది. అదే సమయంలో రాజకీయంగా ప్రభావం ఉన్న కుటుంబాల భూముల గురించి వందల ఎకరాల లెక్కలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ గొంతెత్తి ప్రశ్నిస్తున్నాడు... సామాన్యుడికి వంద గజాలు ఎందుకు కష్టం? నాయకులకు వందల ఎకరాలు ఎలా సాధ్యమని..?

#Telangana Politics#Revanth Reddy#KCR#KCR Family#Telangana Land Issue#Telangana Land Politics#Telangana News#Revanth Reddy News#BRS#Congress Telangana#Telangana Political News#Telangana Political Analysis#Hyderabad Land Issue#Telangana Politics 2026#Political Controversy#Land Allegations#Farm House Politics#Telangana Government#Telangana Latest News#Telangana Political Debate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి