వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా పండుగ సందడి మొదలవుతుంది. వీధివీధినా గణపతి మండపాలు కొలువుదీరుతాయి. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు.. తమ గణపతి విగ్రహం ప్రత్యేకంగా కనిపించాలనే ఉత్సాహం నిర్వాహకుల్లో కనిపిస్తుంది. దీంతో ఒకరికొకరు పోటీ పడుతూ భారీగా, ఆకర్షణీయంగా, వినూత్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విజయవాడలో మాత్రం ఈసారి గణపతి సందడి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
నగరంలోని విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల ఎత్తైన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఈ భారీ విగ్రహం పూర్తిగా మట్టితో రూపొందించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వాహకులు సందేశాన్ని కూడా ఇచ్చారు.
ఇంతటి భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో.. ఈ విగ్రహం ఎత్తైన పర్యావరణహిత గణేశుడిగా ఇంజీనియస్ ఛార్మ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చేతుల మీదుగా డూండీ గణేశ సేవా సమితి ప్రతినిధులు అందుకున్నారు. ఇక ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా నగరాల్లో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
మరో విశేషం ఏంటంటే.. ఈ భారీ 72 అడుగుల మట్టి విగ్రహాన్ని తరలించి వేరే ప్రాంతంలో నిమజ్జనం చేయకుండా.. ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మొత్తానికి.. భక్తి, వైభవం, కళాత్మకతతో సాగుతున్న వినాయక చవితి వేడుకల్లో విజయవాడ 72 అడుగుల మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ విగ్రహాల ఏర్పాటులో కొత్త రికార్డు సృష్టించడమే కాకుండా.. పర్యావరణహిత గణపతి ఉత్సవాలకు కూడా ఇది ఒక ఉదాహరణగా నిలిచింది..









