యూపీఐ లావాదేవీల ఉచిత సేవలపై ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. యూపీఐ చెల్లింపులపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' లేదా MDR పేరిట చార్జీలు విధించే ప్రతిపాదనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ భారత్‌లో సామాన్యుడిపై, చిన్న వ్యాపారులపై భారం మోపడమేంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
అయితే, రాహుల్ గాంధీ వైఖరిపై భారతీయ జనతా పార్టీ అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీ ఎంపీల నిర్ణయాలకే విరుద్ధంగా ఉన్నాయంటూ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యూపీఐ వ్యవస్థ నిలదొక్కుకోవడానికి దశలవారీగా ఆదాయ నమూనాను... అంటే MDR విధానాన్ని పరిశీలించాలని సూచించిన పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారని బీజేపీ గుర్తుచేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం, సీనియర్ నాయకులు మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కె. గోపీనాథ్.. ఈ ఐదుగురు కాంగ్రెస్ నాయకులు సదరు పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గడిచిన ఆగస్టు 12న ఈ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించిన సమయంలో ఈ ఐదుగురు ఎంపీలు స్వయంగా హాజరయ్యారు. ఆ నాడు కమిటీ ప్రతిపాదనలపై ఈ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
మరి పార్లమెంటరీ కమిటీ వేదికగా చిదంబరం, మనీష్ తివారీ లాంటి సీనియర్లు మద్దతు తెలిపిన అంశాన్ని.. బయట రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడుతున్న బీజేపీ వర్గాలు.. కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయం లేదనడానికి ఇదో నిదర్శనమని విమర్శలతో విరుచుకుపడ్డాయి.. ఇక పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీ తన నివేదికలో.. యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలంలో స్వయంసమృద్ధిగా నిలదొక్కుకోవాలంటే తగిన ఆదాయ మార్గం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలపై దశలవారీగా ఎండీఆర్ విధించడాన్ని పరిశీలించాలని సూచించింది. దీనికి బలమైన కారణాలను కూడా కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ నుంచి యూపీఐ ప్రోత్సాహకాలకు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. కానీ, ఈ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడానికి ఏడాదికి ఏకంగా రూ. 20,700 కోట్లు వ్యయం అవుతోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఈ వ్యవస్థ నిరంతరం ఆధారపడితే... చెల్లింపుల మౌలిక సదుపాయాల విస్తరణ, సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టంగా, సురక్షితంగా ఉండాలంటే ఆదాయ వనరులను సృష్టించుకోవడం తప్పనిసరి అని కమిటీ తేల్చి చెప్పింది.












