తెలంగాణ

Patancheru: విద్యార్థుల మృతి కేసులో కీలక పరిణామం.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ అరెస్ట్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరుగురిలో నాలుగు కుటుంబాలకు కలెక్టర్ చెక్కులు అందజేయగా.. మిగిలిన రెండు కుటుంబాలు వాటిని తీసుకునేందుకు నిరాకరించాయి.

వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వెళ్లిన యువతలో కొందరు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రుల కళ్లలో ఎన్నో ఆశలు నింపిన పిల్లలు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారుతుండటంతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది. పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.

ముఖ్యంగా చెరువులు, నదులు, కాలువల వద్ద నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నా.. కొన్ని చోట్ల ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అకారణంగా మృతి చెందడం విషాదాన్ని నింపుతున్నాయి.. ఇక పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు వినాయక నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థులు నేరేడు చెరువులో పడి ప్రాణాలు విడిచారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు.. తాజాగా శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మరోవైపు మరణించిన విద్యార్థులకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకెళ్లేది లేదని కుటుంబ సభ్యులు, బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తికాగా, మిగతా మృతదేహాలకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరుగురిలో నాలుగు కుటుంబాలకు కలెక్టర్ చెక్కులు అందజేయగా.. మిగిలిన రెండు కుటుంబాలు వాటిని తీసుకునేందుకు నిరాకరించాయి. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు..

#Patancheru#Pedda Kanjarla#Six students#death case#Sirisha Memorial Trust#warden arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి