క్రైమ్

ప్రేమ వివాహంపై కక్ష.. సినీ ఫక్కీలో కారు ఛేజింగ్, యువతి కిడ్నాప్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ప్రేమ వివాహం చేసుకుందన్న ఆక్రోశంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. రాజస్థాన్‌కు చెందిన పూజ(21), ఓం ప్రకాశ్ (23) కులాంతర వివాహం చేసుకుని బెంగళూరులోని అగ్రహార దాసనహళ్లిలో నివాసముంటున్నారు.

 కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ప్రేమ వివాహం చేసుకుందన్న ఆక్రోశంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. రాజస్థాన్‌కు చెందిన పూజ(21), ఓం ప్రకాశ్ (23) కులాంతర వివాహం చేసుకుని బెంగళూరులోని అగ్రహార దాసనహళ్లిలో నివాసముంటున్నారు. ఈ పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు ఆమెను తిరిగి తీసుకువెళ్లేందుకు నలుగురు వ్యక్తులను రాజస్థాన్ నుంచి బెంగళూరుకు పంపగా, బుధవారం రాత్రి వారు యువతి ఇంట్లోకి చొరబడి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు.

 కిడ్నాపర్లు రాజస్థాన్ రిజిస్ట్రేషన్ (RJ 22 CC 9691) కలిగిన హ్యుందాయ్ వెన్యూ కారులో అతివేగంగా తప్పించుకునే క్రమంలో విజయ్‌నగర్, మగాడి రోడ్డు ప్రాంతాల్లో తీవ్ర బీభత్సం సృష్టించారు. కారుతో పలు వాహనాలను వరుసగా ఢీకొట్టడంతో పృథ్వీరాజ్, యషిక, అముల్, మణి, జయలక్ష్మి, సంతోష్ అనే ఆరుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయమైన జయలక్ష్మి అనే మహిళను ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చగా, మిగతా క్షతగాత్రులకు నగర ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

 ప్రమాదాలను గమనించిన స్థానికులు, వాహనదారులు ఆగ్రహంతో ఆ కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులోని నిందితులను బయటకు లాగి దేహశుద్ధి చేస్తుండగా, సదరు యువతి కలగజేసుకుని వారు తన కుటుంబ సభ్యులేనని చెప్పడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న విజయ్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యువతిని సురక్షితంగా తమ సంరక్షణలోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 ఈ ఘాతుకానికి పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన రాకేశ్ (31), కరణ్ (25), అయాన్ (18) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు నడిపి బీభత్సం సృష్టించిన సద్దాం అనే వ్యక్తి పరారీలో ఉండగా, వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు అతని కోసం గాలింపు వేగవంతం చేశారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

#BengaluruNews#HonorKillingAttempt#CrimeNews#BengaluruPolice#HitAndRun#RajasthanNews#ViralNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి