రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. వినాయకచవితి రోజున రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. అయితే, నేడు, రేపు రాష్ట్రంలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు, తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు.
ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు అత్యంత ఉక్కపోత ఉంటుందని, వాతావరణంలో మాత్రం తేమ ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం తర్వాత అక్కడక్కడ చెదురుమొదురు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.రాత్రి వేళ నుంచి తెల్లవారుజాము సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, పలు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భీకర వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా రెడ్ అలర్ట్ సూచించిన జిల్లాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.ఇక హైదరాబాద్ మహానగరంలోనూ పగటిపూట తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉంటుందని, అర్ధరాత్రి తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు రాత్రి బయటకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని, రైతులు, పాదచారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయొద్దని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.












