హైదరాబాద్‌లో హోటల్‌కు వెళ్లి ఫుడ్ తినాలంటే ఆలోచించవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ కు కేరాఫ్ గా మారిన నగరంలో విచ్చలవిడిగా కల్తీ పుడ్ తో పాటు.. పరిశుభ్రత పాటించకుండా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా టీజీ సేఫ్ చేపట్టిన తనిఖీల్లో కనిపించిన దృశ్యాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి.
ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం ప్రాంతాల్లో టీజీ సేఫ్ 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించింది. మొత్తం 20 ఆహార తయారీ కేంద్రాలను పరిశీలించగా.. ఏకంగా 9 చోట్ల తీవ్ర స్థాయిలో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడం, పరిశుభ్రతపై నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికారులు చర్యలకు దిగారు.
ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కనిపించడంతో.. 9 హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తూ టీజీ సేఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆయా సంస్థలు వెంటనే తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. గెలాక్సీ కేఫ్, అంటెరా, లక్కీ రెస్టారెంట్, జాయింట్ ఆల్‌మండి, విజయ రాఘవేంద్ర హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు వన్‌లాంజ్, కేఫీ కేఫ్, గ్రీన్‌లాండ్ దాబాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు.
అయితే ఇది ఒక్కరోజు ఘటన కాదు. గతంలోనూ హైదరాబాద్, తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఆహారం, కల్తీ పదార్థాలు, అపరిశుభ్ర వంటగదులు, కాలం చెల్లిన పదార్థాల వినియోగంపై అధికారుల తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. పనీర్, నూనె, మసాలాలు, మాంసాహార పదార్థాలు సహా పలు ఆహార ఉత్పత్తుల నాణ్యతపై కూడా గతంలో ఫిర్యాదులు, తనిఖీలు, కేసులు వెలుగులోకి వచ్చాయి.
కొన్ని సందర్భాల్లో ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన ఘటనలు కూడా ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఇప్పుడు మరోసారి టీజీ సేఫ్ దాడులతో హోటళ్ల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బయటికి మెరిసిపోయే హోటల్ కనిపిస్తే సరిపోదు.. వంటగదిలో పరిశుభ్రత ఎలా ఉంది? ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేస్తున్నారు? సిబ్బంది నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలు కూడా గమనించవలసిన అవసరం ఉందని తెలుస్తుంది.
కాబట్టి బయట ఫుడ్ తినే ముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు.. ఎందుకంటే పలు హోటళ్లల్లోని ఫ్రీజర్‌లో పాడైన చికెన్, మటన్, తందూరీ చికెన్, కబాబ్‌లు నిల్వ ఉంచడం.. మాంసం, చికెన్ రక్తపు మరకలతో వంటగది అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్ర లోపాలు తరచుగా బయటపడటం తెలిసిందే..









