పార్లమెంట్‌లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన యాంటీ పేపర్ లీక్ బిల్లు పై రాజ్యసభలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏసీ గదుల్లో కూర్చొని రాజకీయాలు చేయొద్దని, ఏదో ఒక రోజు ప్రతిపక్షం నేతలు మిమ్మల్ని బయటకు లాగుతారని హెచ్చరించిన ఖర్గే.. దమ్ముంటే అమిత్ షా సభలో వచ్చి కూర్చోవాలని సవాల్ విసిరారు..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించి మోదీ తన కుర్చీని కాపాడుకున్నారని ఆరోపించిన మల్లికార్జున ఖర్గే.. పేపర్ లీకులతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీలు, పెల్లెట్ గన్ల వినియోగం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెల్లెట్ గాయాలతో పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఈ పరిస్థితికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని ఖర్గే ఆరోపించారు.
ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలతో రాజ్యసభ ఒక్కసారిగా దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే వాడిన పదజాలం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ఆ వ్యాఖ్యలను అధికారిక రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుడిగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని కూడా సూచించారు.
మరోవైపు ఇటీవలి కాలంలో విద్యార్థుల ఉద్యమాలు, వాటిపై ప్రభుత్వ స్పందన వంటి అంశాలపై వాదోపవాదాలతో పార్లమెంట్‌లో రాజకీయాలు హిట్ పుట్టిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












