Anil Ravipudi: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది.. అదే అనిల్ రావిపూడి. బాక్సాఫీస్ వద్ద నిలకడగా విజయాలు సాధిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. సినిమా మేకింగ్‌లో ఆయన వేగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మిగతా స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే వేగంగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తూ, అనుకున్న టైమ్‌కి థియేటర్లలోకి తీసుకురావడంలో ఆయనది అందెవేసిన చెయ్యి.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌తో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకోకముందే, ఆయన నెక్స్ట్ లైనప్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఒక సినిమా పూర్తి కాకుండానే ఏకంగా మరో మూడు ప్రాజెక్ట్‌లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
వెంకీ సినిమా తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సరికొత్త యానిమేషన్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్‌లో ఈ జానర్ చాలా అరుదు కాబట్టి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) బేనర్‌లో మరో సినిమా ఉండగా, అలాగే సాహు గారపాటి, సతీష్ కిలారు సంయుక్తంగా తెరకెక్కించే మరో భారీ ప్రాజెక్ట్‌కు కూడా ఆయన పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
ఇలా చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తూనే, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న అనిల్ రావిపూడి జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆయన తగ్గేదేలే అంటున్నట్లే ఉంది. ఈ స్పీడ్, క్లారిటీ చూసిన టాలీవుడ్ మేకర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవెల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.












