క్రీడలు

Hockey India: భారత హాకీ టీమ్‌లకు సరికొత్త జెర్సీలు.. మాజీ ప్లేయర్ల అసంతృప్తి!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రాబోయే పురుషుల, మహిళల ప్రపంచకప్‌ టోర్నీల కోసం హాకీ ఇండియా భారత జాతీయ జట్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. అయితే, ఇప్పటివరకు ‘మెన్ ఇన్ బ్లూ’గా నీలం రంగు డ్రెస్‌లో అలరించిన భారత హాకీ జట్టు, ఈసారి కాషాయం (ఆరెంజ్) రంగు జెర్సీల్లో కనిపించనుండటం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

రాబోయే పురుషుల, మహిళల ప్రపంచకప్‌ టోర్నీల కోసం హాకీ ఇండియా భారత జాతీయ జట్ల సరికొత్త జెర్సీలను ఆవిష్కరించింది. అయితే, ఇప్పటివరకు ‘మెన్ ఇన్ బ్లూ’గా నీలం రంగు డ్రెస్‌లో అలరించిన భారత హాకీ జట్టు, ఈసారి కాషాయం (ఆరెంజ్) రంగు జెర్సీల్లో కనిపించనుండటం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆకస్మిక మార్పుపై భారత జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ... "భారత హాకీ అభివృద్ధికై హాకీ ఇండియా ఎన్నో ప్రశంసనీయమైన నిర్ణయాలు తీసుకుంది. కానీ జెర్సీ రంగును మార్చడం మాత్రం నన్ను నిరాశపరిచింది. దశాబ్దాలుగా మన జట్టు వారసత్వం, గుర్తింపు అంతా ‘బ్లూ’ రంగుతోనే పెనవేసుకుపోయింది. అభిమానులు కూడా మన క్రీడాకారులను నీలం రంగు దుస్తుల్లోనే చూడటానికి ఇష్టపడతారు. అసలు ఈ ఆరెంజ్ రంగును ఎంచుకోవడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు" అని పేర్కొన్నారు.

https://x.com/virenrasquinha/status/2082532920938697029?s=20

మరోవైపు, ఈ వివాదంపై హాకీ ఇండియా స్పష్టతనిచ్చింది. ఈ మార్పు వెనుక ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని, కేవలం సాంకేతిక కారణాల వల్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఇచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో వివరించింది. జెర్సీ మార్పుపై వస్తున్న విమర్శలు, వివాదాలకు తెరదించేందుకు అసలు కారణాలను వెల్లడిస్తూ హాకీ ఇండియా ఒక సుదీర్ఘ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

కాగా, ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా పురుషుల ప్రపంచకప్ జరగనుండగా.. అదే సమయంలో (ఆగస్టు 15 నుంచి 30 వరకు) మహిళల టోర్నీ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌ 2026 టోర్నీలో భారత్ ‘పూల్-డి’లో స్థానం సంపాదించుకుంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వేల్స్, వైరివర్గం పాకిస్థాన్‌లతో మన జట్టు తలపడనుంది. 1975లో పాక్‌ను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్ ముద్దాడిన భారత్... గత 50 ఏళ్లుగా ఆ ఘనతను మళ్లీ సాధించలేకపోయింది.

చివరిగా భువనేశ్వర్‌లో జరిగిన 2023 ప్రపంచకప్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న మన జట్టు, ఈసారి మాత్రం హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు సాధించడంతో పాటు, ఆసియా కప్, ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీలలో సాధించిన చిరస్మరణీయ విజయాలు జట్టులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అదే ఊపుతో ఈసారి ఎలాగైనా ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో భారత్ ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతోంది.

#hockey world cup 2026#hockey india new jersey#viren rasquinha#indian hockey team orange jersey#men in blue hockey#hockey world cup pool d#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి