నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్,జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరబ్ దాస్ కేంద్రాన్ని కోరారు. తమకు ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలని, లేదంటే మరోసారి పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కాగా, బిహార్, వెస్ట్ బెంగాల్,అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాల్లో విద్యార్థులపై పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయని, వారంతా తమను అప్రోచ్ అవుతున్నారని సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్నాక చాలా మంది విద్యార్థులు తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వారిని వెంటాడి మరీ కేసులు పెడుతున్నారని సీజేపీ ఆరోపిస్తున్నది. విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా..విచారించిన న్యాయస్థానం మైనర్లు,నేరచరిత్ర లేని వారిని మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది.దీంతో సీజేపీ ప్రతినిధులు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోయారు.
https://x.com/TeluguScribe/status/2082697140552220703?s=20
తాజాగా ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘ధర్మేంద్ర ప్రధాన్‌ను దించినట్లే.. ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం. విద్యార్థుల ఆగ్రహం సద్దుమణగలేదు.. అవసరమైతే ఇంకా పెద్ద ఉద్యమం చేస్తాం.నరేంద్ర మోదీ వీడియోలు బాగా చేస్తున్నాడు.. ప్రధాని పదవిని వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వొచ్చు. నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు.
విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలి.. వారిపై పోలీసులు పెల్లెట్ తుపాకులు వాడడానికి అనుమతులిచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్నే మార్చేస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ్టిలోగా కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని నిన్న సేజేపీ ప్రకటించింది.












