మారుతున్న జెన్‌జీ ట్రెండ్
నిద్ర కోసం థియేటర్లకు క్యూ...
బ్రేక్‌లో సినిమా కాదు.. నిద్రే!
ఒత్తిడికి కొత్త పరిష్కారాలు వెతుకుతున్న యువత
ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు.. ప్రెషర్ కూడా. ముఖ్యంగా జెన్‌జీ ఉద్యోగుల్లో ఈ ఒత్తిడి కొత్త ట్రెండ్‌కు దారితీస్తోంది. లంచ్ బ్రేక్‌లో భోజనం చేయడం కంటే.. కొంతసేపు ప్రశాంతంగా నిద్రపోవడం, ఒంటరిగా గడపడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రిలాక్స్ అవ్వడం వంటి అలవాట్లు పెరుగుతున్నాయి.
ఈ ట్రెండ్‌కు అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌కు చెందిన బెన్ శాండర్సన్ సినిమా చూడడానికి టికెట్ తీసుకున్నప్పటికీ.. థియేటర్‌లోని రిక్లైనర్ సీటులో 90 నిమిషాలు నిద్రపోయాడట. ఆ నిద్ర తనకు చాలా రోజుల తర్వాత దొరికిన అసలైన రిలీఫ్ అని చెప్పడంతో వేలాది మంది యువ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకోవడం ప్రారంభించారు.
చాలామంది లంచ్ బ్రేక్‌లో పార్క్‌కు వెళ్లడం, మెట్రో స్టేషన్‌లో కూర్చోవడం, కారులో కొద్దిసేపు నిద్రపోవడం లేదా ప్రశాంతంగా ఒంటరిగా గడపడం తమకు మానసిక ఉపశమనం ఇస్తోందని చెబుతున్నారు.
ఇండియాలోనూ సేమ్ సీన్
ఇలాంటి పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ, బీపీఓ, స్టార్టప్ కంపెనీల్లో పనిచేస్తున్న యువత టార్గెట్లు, డెడ్‌లైన్లు, వరుస మీటింగ్స్, నిరంతర ఆన్‌లైన్ వర్క్ కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కోవిడ్ తర్వాత హైబ్రిడ్ వర్క్ కల్చర్ రావడంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మరింత సవాల్‌గా మారిందని ఉద్యోగులు అంటున్నారు.
దీనికి తోడు AI ప్రభావం కూడా యువతలో ఆందోళన పెంచుతోంది. ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న సందేహం, కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన ఒత్తిడి కూడా వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడం బలహీనత కాదు. మళ్లీ ఉత్సాహంగా పనిచేయడానికి మెదడుకు అవసరమైన రీఛార్జ్. అందుకే జెన్‌జీ ఉద్యోగులు ఎంచుకుంటున్న ఈ 'బ్రేక్ కల్చర్' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. పని మధ్యలో కొద్ది నిమిషాల ప్రశాంతత కోసం వెతుకుతున్న ఈ తరం.. మారుతున్న కార్పొరేట్ ప్రపంచానికి కొత్త సంకేతాలను ఇస్తోంది.












