ప్రభుత్వ టీచర్లే మత్తుపదార్థాల విక్రాయాలకు తెరలేపారు. కేరళరాష్ట్రంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళా టీచర్లు మత్తు పదార్థాలు విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా చేయడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి తెరలేపింది. రెండ్రోజుల కిందట ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓవైపు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఏజెంట్లుగా మారి డ్రగ్స్ విక్రయించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
వాయిదా పద్దతుల్లో డ్రగ్స్ అమ్ముతూ యువతను మత్తుకు బానిసలుగా చేసినట్టు పోలీసులు గుర్తించారు. పేర్లు మార్చుకుని ఈ కొత్త దందాకు ప్రభుత్వ టీచర్లు పూనుకున్నట్టు తెలిసింది. వీరివెనుక అంతర్రాష్ట్ర మత్తుపదార్థాల ముఠా పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి.
ప్రస్తుతం ఈ కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’కు అప్పగించినట్టు తెలుస్తుండగా.. పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలతో వీరికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. వీరి ద్వారా చాలా మంది ‘సింథటిక్ డ్రగ్స్’కు బానిసలైనట్లు కోజికోడ్ జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు. విలాసవంతమైన జీవితం కోసమే టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నట్టు తేలింది.
మరికొందరు యువకులను డ్రగ్ రవాణాదారులుగా మార్చడానికి వీరు డబ్బు ఆశచూపినట్టు సమాచారం. ప్రస్తుతం కేరళలోని వివిధ పీఎస్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నవారిని పట్టుకోవడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కే.సి.కీర్తన, కే. కావ్య, వి.పి.నీష్మా అనే ముగ్గురు ప్రభుత్వ టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు.యువతను మత్తుకు బానిసలుగా చేయడం,అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లకు వీరు ఆర్థికలావాదేవీలు జరిగే మధ్యవర్తులుగా ఉన్నారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ డెలివరీ బాయ్ జిజిన్ కురియాకోస్‌ను కూడా ఇదే నెట్వర్క్‌లో అరెస్టు చేసినట్టు సమాచారం.












