ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్' తన వినియోగదారులకు మరో అద్భుతమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (HPCL)తో కలిసి ఎల్పీజీ (LPG) సిలిండర్లను నేరుగా ఇళ్లకే డెలివరీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. క్విక్ కామర్స్ రంగంలో వంట గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయడమనేది దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రస్తుతానికి బెంగళూరు నగరంలోని సుబ్రమణిపుర ప్రాంతంలో జూలై 15నుంచి ఈ సేవలను ప్రయోగాత్మకంగా (ట్రయల్ రన్) ప్రారంభించారు. ఈ ట్రయల్ విజయవంతమైతే త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇన్‌స్టామార్ట్ సమాయత్తమవుతోంది. ఈ నూతన సేవ ద్వారా వినియోగదారులు హెచ్‌పీసీఎల్ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన 10 కేజీల లైట్‌వెయిట్ కాంపోజిట్ సిలిండర్‌తో పాటు 5 కేజీల చిన్న సిలిండర్లను కూడా ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే సిలిండర్ ఇంటి తలుపు తట్టేలా ఈ వ్యవస్థను రూపుదిద్దారు. ఇక్కడ విశేషమేమిటంటే, ఈ సిలిండర్లను పొందడానికి వినియోగదారులకు ముందస్తుగా గృహ ఎల్‌పీజీ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. మొదటిసారి ఆర్డర్ ఇచ్చే సమయంలో ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ (ID Proof) పూర్తయ్యాక సిలిండర్ అందిస్తారు. ఆ తర్వాత ఇచ్చే ఆర్డర్లను సాధారణ రీఫిల్‌గా పరిగణించి, కొత్త సిలిండర్ ఇచ్చేటప్పుడు పాత ఖాళీ సిలిండర్‌ను డెలివరీ ఏజెంట్ తీసుకెళ్తారు.
ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిన్న కుటుంబాలు, అద్దె ఇళ్లలో తాత్కాలికంగా నివసించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ సేవలను రూపొందించారు. అత్యవసర సమయంలో సెకండ్ సిలిండర్ అవసరమయ్యే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన డెలివరీ సిబ్బంది మాత్రమే ఈ సిలిండర్లను పంపిణీ చేస్తారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మెట్రో నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లలో ఉండే వారికి ఈ వేగవంతమైన డెలివరీ విధానం ఒక పెద్ద ఊరటగా మారనుంది.












