వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేసేందుకు ‘సింగిల్ విండో క్లియరెన్స్’ విధానాన్ని తీసుకరావాలని నిర్ణయించింది. దీంతో నూతన ఆస్పత్రుల క్లియరెన్స్ కోసం విభిన్న ప్రభుత్వ శాఖల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే అవసరం లేకుండా, కేవలం కొన్ని నెలల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది. సీఎం విజయ్ శుక్రవారం(రేపు) నిర్వహించనున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల సమావేశం అనంతరం దీనిపై అధికారిక ఉత్తర్వులు (జీవో) వెలువడనున్నాయి.
పారిశ్రామికంగా, వైద్యపరంగా ముందుంజలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల సరసన తమిళనాడును నిలిపేలా ఈ కీలక నిర్ణయం తోడ్పడనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానం కారణంగా ఆసుపత్రి భవన నిర్మాణాలు, ప్రాజెక్ట్ డిజైన్ల అనుమతుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందని, అనుమతుల పేరుతో రూ. 40-50 లక్షల వరకు అక్రమ వసూళ్లు, లంచాల ఆరోపణలు వస్తున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ అడ్డంకుల కారణంగానే దాదాపు 7-8 మంది వైద్యులు తలపెట్టిన బృహత్తర ఆసుపత్రి ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
నూతన సింగిల్ విండో విధానంలో పారదర్శకమైన, ముందస్తుగా నిర్దేశించిన రుసుముల పద్ధతి అందుబాటులోకి రానుంది. దీనివల్ల అక్రమాలకు చెక్ పడటంతో పాటు దశాబ్ద కాలంగా హెల్త్‌కేర్ రంగ నిపుణులు ఎదురుచూస్తున్న కల నెరవేరి, రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య ప్రాజెక్టులు, పెట్టుబడులు వేగవంతం కానున్నాయి. ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల కేవలం నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అనుమతుల ప్రక్రియ సులభతరం కావడంతో విదేశీ పెట్టుబడులు (FDI), ఎన్‌ఆర్‌ఐ (NRI) వైద్యులు కూడా తమిళనాడు వైపు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో మెరుగైన ఉచిత, తక్కువ ధర వైద్య సేవలు సాధారణ ప్రజలకు సులువుగా అందుబాటులోకి రావడమే కాకుండా, పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు, వైద్య విద్యా రంగంలో కొత్త ప్రాజెక్టులు వేగవంతంగా పట్టాలెక్కనున్నాయి.












