ఏపీ

Pulasa Fish: గోదావరిలో చిక్కిన తొలి పులస.. ఎంత రేటు పలికిందంటే!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లో భోజనప్రియులు ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సరిహద్దుల్లోని యానాం తీరానికి ఈ సీజన్‌లో మొట్టమొదటి ‘పులస’ చేప చేరుకోవడంతో మత్స్యకారుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది.

తెలుగు రాష్ట్రాల్లో భోజనప్రియులు ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సరిహద్దుల్లోని యానాం తీరానికి ఈ సీజన్‌లో మొట్టమొదటి ‘పులస’ చేప చేరుకోవడంతో మత్స్యకారుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. గోదావరిలోకి ఎగువ ప్రాంతాల నుంచి ఎర్రనీరు పోటెత్తుతుండటంతో, సీజన్‌ బోణీ అదిరిపోయే స్థాయిలో ప్రారంభమైంది.

యానాం సమీపంలో వేటకు వెళ్లిన వేటగాళ్ల వలకు సుమారు కిలోన్నర బరువున్న తొలి పులస చిక్కింది. ఆ వెంటనే దాన్ని యానాం బహిరంగ చేపల మార్కెట్‌కు తీసుకురాగా, వేలంలో ఈ రాయల్ ఫిష్ కోసం కొనుగోలుదారులు తీవ్ర పోటీ పడ్డారు. చివరికి పోనమండ భద్రం, రత్నం అనే మత్స్యకార దంపతులు రూ.14వేలు వెచ్చించి ఈ తొలి పులసను సొంతం చేసుకున్నారు. విచిత్రమేమిటంటే, ఆ తర్వాతి కొద్ది నిమిషాల్లోనే మరో మత్స్యకారుడు వారికంటే రూ.500 అదనంగా ఆఫర్ చేయడంతో, రూ.14,500లకు ఆ చేప మళ్లీ చేతులు మారింది.

తొలి చేపకే ఈ స్థాయిలో డిమాండ్ రావడంతో మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి వర్షాకాలంలో గోదావరికి ఎర్రనీరు, వరద ఉధృతి పెరిగే సమయంలో సముద్రం నుంచి ఈ ‘పులస’ చేపలు గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి. అలా ఉప్పునీటి నుంచి మంచినీటిలోకి ఈదుకుంటూ వచ్చి రుచిని మార్చుకునే ఈ చేపలే ‘పులస’లుగా మారి మాంసాహారులకు ప్రయమైన ఆహారాల్లో ఒకటిగా నిలిచింది.  

ప్రస్తుతం నదిలో ప్రవాహం పుంజుకోవడంతో రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో పులసలు లభ్యమవుతాయని వేటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "పుస్తెలు అమ్మయినా పులస తినాల్సిందే" అనే సామెతను నిజం చేస్తూ, కోనసీమ పులస పులుసు ఘుమఘుమల కోసం ఇటు ఆంధ్రా, అటు తెలంగాణ భోజనప్రియులు యానాం వైపు ఉత్సాహంగా అడుగులేస్తున్నారు.

పులసల సీజన్.. వేల రూపాయలతో వేలం

సాధారణంగా ఏ చేప అయినా కేజీ ఎంత అని అడిగి కొంటాం, కానీ పులస విషయంలో మాత్రం సైజును బట్టి పందెం కాసినట్లు వేలం పడాల్సిందే. కేవలం ఒక్క రోజు తేడాలోనే వేలల్లో ధరలు పలికే ఈ చేపకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వలలో పడ్డ పులసను దక్కించుకోవడానికి వ్యాపారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పోటీపడతుంటే.. తమ ఇళ్లల్లో వండుకుని ఆస్వాదించేందుకు సామాన్యులు కూడా ఆసక్తి చూపుతారు. గోదావరి జిల్లాల ఆతిథ్యానికి ఈ పులస పులుసే ప్రధాన వేదిక కావడం వల్ల, ఏటా ఈ సీజన్‌లో బంధువులకు, వీఐపీలకు బహుమతిగా పంపడానికి కూడా ఈ రాయల్ ఫిష్‌ను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

#pulasa fish#godavari pulasa#yanam fish market#konaseema pulasa#pulasa season#godavari river fish
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి