National

Bihar: ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. అయినా మంత్రి ఎలా?

రచన: Venu6 నిమిషాల పఠనం

దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్‌కు చెందిన ఓ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కూడా కాదు. రాష్ట్రంలోని ఏ చట్టసభలోనూ ప్రస్తుతం ఆయన సభ్యుడు కాదు. అయినప్పటికీ 2025లో అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్‌కు చెందిన ఓ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాష్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందుంది. ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4)పై సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఎలాంటి తీర్పు ఇస్తుంది? అన్న దానిపై రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

దీపక్ ప్రకాష్ ప్రస్తుతం బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కూడా కాదు. రాష్ట్రంలోని ఏ చట్టసభలోనూ ప్రస్తుతం ఆయన సభ్యుడు కాదు. అయినప్పటికీ 2025లో అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

అయితే 2026 ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మంత్రివర్గం రద్దయింది. దీంతో దీపక్ ప్రకాష్ కూడా మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటివరకు ఆయన సుమారు నాలుగు నెలల 26 రోజుల పాటు మంత్రిగా పనిచేశారు. తర్వాత 22 రోజుల పాటు ఆయనకు ఎలాంటి మంత్రి పదవి లేదు. అనంతరం 2026 మే 7న సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఆ కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌కు మరోసారి అవకాశం కల్పించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తి ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో కొనసాగకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టం చేస్తోంది. అయితే దీపక్ ప్రకాష్‌ను మళ్లీ మంత్రిగా నియమించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక కాకుండానే ఒక వ్యక్తి ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారో వివరించాలని బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశం పై అత్యవసర విచారణ కోసం ఆగస్టు 4కు కేసును జాబితా చేశారు. అయితే బీహార్ ప్రభుత్వం మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది.

దీపక్ ప్రకాష్ ఒకే విడతలో ఆరు నెలలు మంత్రిగా కొనసాగలేదని, మధ్యలో 22 రోజుల విరామం ఉందని, రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా ఆరు నెలల గడువు లెక్కించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక చట్టసభ సభ్యుడు కాని వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన ఆరు నెలల గడువు మొత్తం ఒకేసారిగా పరిగణించాలా? లేక మధ్యలో విరామం వస్తే మళ్లీ కొత్తగా లెక్కించాలా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

గతంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల్లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలాగే ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలు జరగకపోవడంతో ఆరు నెలల గడువు పూర్తికాకముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇప్పుడు దీపక్ ప్రకాష్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మంత్రి భవిష్యత్తునే కాదు... భవిష్యత్తులో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తులను మంత్రులుగా నియమించే విధానంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

#National#supreme-court#bihar#panchayati-raj#minister deepak prakash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి