రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. అభివృద్ధి పేరుతో హామీలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సామాన్యుడు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఆదాయం తక్కువ.. అవసరాలు ఎక్కువ.. పెరుగుతున్న ధరలు, రోజువారీ సమస్యలు.. వీటన్నింటి మధ్య జీవితం సాగిస్తున్న ప్రజలకు వర్షాకాలంలో మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. అవే గుంతలమయంగా మారుతున్న రోడ్లు..
వేసవిలో ఎండలు, వర్షాకాలంలో నీటిమునిగిన రహదారులు, చలికాలంలో ఇబ్బందులు... ఇలా ప్రతి సీజన్‌లోనూ ప్రజల బాధలు కొత్త రూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడితే రోడ్లు చెరువులను తలపించే పరిస్థితి నెలకొంటోంది. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినా... సురక్షితంగా ఇల్లు చేరతామా లేదా అనే భయం ప్రజలను వెంటాడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దారుణంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా గుండె సంబంధిత రోగులు, ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటమాడటమేనని అన్నారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పే ప్రభుత్వాలు.. రహదారుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా రూ.20 వేల కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నగరంలోని అనేక రోడ్లు గుంతలమయంగా మారినా అధికారులు మాత్రం అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాగితాలపై అభివృద్ధి చూపించడం కాదు... ఒక్కసారి ప్రజలతో కలిసి ఈ రోడ్లపై ప్రయాణిస్తే అసలు పరిస్థితి అర్థమవుతుందని విమర్శించారు.
నిధులు మంజూరవుతున్నా పనులు మాత్రం కనిపించడం లేదని, ప్రజల ప్రాణాల కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ఈ ప్రమాదకర రహదారితో పాటు నగరంలోని గుంతల రోడ్లన్నింటినీ వెంటనే మరమ్మతు చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని... అభివృద్ధి అంటే ప్రకటనలు కాదు, ప్రజలకు సురక్షితమైన మౌలిక సదుపాయాలు కల్పించడమేనని వారు స్పష్టం చేశారు.












