వైరల్ న్యూస్

Maharashtra: 200ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన చిన్నారి!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే నేటి పరిస్థితులకు భిన్నంగా.. అమ్మాయి జననం ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమనే సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబ సభ్యులు తెలిపారు

ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే ఆందోళన పడుతున్న నేటి రోజుల్లో.. ఆడపిల్ల పుట్టుకను భారంలా కాకుండా, ఇంటికి వచ్చిన గొప్ప అదృష్టంగా భావించిన కుటుంబం గురించి తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఏకంగా 200 ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో తొలిసారిగా ఓ ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఆ అరుదైన, భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమైంది. వందల సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ వారింటిలో ఆడపిల్ల పుట్టింది. ఆనంద భాష్పాల నడుమ ఆ చంటిపాపను చేతుల్లోకి తీసుకుంటూ, ఆ కుటుంబం పరవశించిపోయింది. అలాగే ఆ పసిపాపాకు కుటుంబ సభ్యులు గార్గి అని నామకరణం చేసి, రాజకుమారిలా ఘనంగా స్వాగతం పలకడం వైరల్ గా మారింది.

ఆసుపత్రి నుంచి తల్లి కల్పనా రిషికేష్ దహిఫలే, చిన్నారి గార్గిల ఇంటికి చేరుకున్న సమయంలో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపించింది. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో తల్లి, బిడ్డలను కూర్చోబెట్టి.. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ అరుదైన వేడుకను చూసేందుకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇక పసిపాపను చూసిన తాతయ్య లింబాజీ దహిఫలే భావోద్వేగానికి గురయ్యారు. తమ వంశంలో ఆడబిడ్డ జన్మించడం ఎంతో గొప్ప అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని వెంటాడిన ఒక వెలితి.. ఈ చిన్నారి రాకతో పూర్తిగా తీరిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే నానమ్మ సురేఖ దహిఫలే సైతం పాపను చూసి మురిసిపోయారు. తమ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే నేటి పరిస్థితులకు భిన్నంగా.. అమ్మాయి జననం ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమనే సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక చిన్నారి రాక.. ఓ కుటుంబానికి ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలదో చాటిచెప్పిన ఈ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

#Maharashtra#Beed#Parli#Dahiphale#vairal news#200 years#five generations#little child
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి