ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీ హబ్ రూపు రేఖలు మారిపోతున్నాయి. అంకుర సంస్థలకు బూస్టప్ కోసం స్థాపించిన టీ హబ్ .. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాని ప్రభావాన్ని కోల్పోతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ మధ్య సీఎం రేవంత్ చేతుల మీదుగానే టీ హబ్‌లో.. ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్’ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్ ప్రస్తుతం వారాంతపు సంతలా మారిందని కొందరు విమర్శలు చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ-హబ్‌ను ఎదుట స్ట్రీట్ మార్కెట్ దర్శనమిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ అయిన టీ-హబ్‌ను స్ట్రీట్ మార్కెట్‌లా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసిందని టెక్ నిపుణులు, స్టార్టప్స్ ఫౌండర్స్ అభిప్రాయపడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పురుడు పోసుకున్న టీ-హబ్‌లో పుట్టిన ‘స్కైరూట్’.. ఇటీవల తొలి ప్రయివేటు రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే.
దీంతో ప్రయివేటు స్పేస్ ప్రోగ్రామ్స్ నిర్వహించే అమెరికా సరసన ఇండియా చేరింది. అంతటి చరిత్ర గల ఈ టీ-హబ్‌ను ఇప్పుడు సంతలో వస్తువులు అమ్ముకునే స్థాయికి రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పు అంటే ఇందేనా..? పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టీ హబ్ పరువు తీస్తున్నారని పలువురు ఫైర్ అవుతున్నారు.కాగా, టీ హబ్‌ను కేవలం ఐటీ రంగం కోసమే కాకుండా.. ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లు సైతం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ మెరుగుపడటానికి మానవ వనరులు అవసరమని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (TASK)ను గత ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. టీ-హబ్ స్ఫూర్తితో వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీవర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)లు కూడా ఏర్పాటు అయ్యాయి. ఇదిలాఉండగా, అద్దెల భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేయగా.. తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.











