అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు ఫైల్ చేసింది. దీంతో నాలుగు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన భీమ్ రెడ్డికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద ఈసీఐఆర్ ఫైల్ చేసినట్టు సమాచారం.
ఇటీవల ఏసీబీ అధికారులు నమోదు చేసిన ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌లో కేవలం రూ.2.4 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి జరిపిన సోదాల్లో సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ.300 కోట్ల మార్కెట్ విలువ గల ఆదాయానికి మించి అక్రమాస్తులను గుర్తించారు.ఏసీబీ పేర్కొన్న వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ లెక్కతెల్చిన ఆస్తుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం.దాదాపు రూ.150 కోట్ల డాక్యుమెంట్ వాల్యూ లెక్కలపై సరైన ఆధారాలు లేవని గుర్తించిన ఈడీ.. త్వరలోనే భీమ్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
డీఎస్పీ భీమ్ రెడ్డి అవినీతి ద్వారా సంపాదించిన నల్లధనాన్ని ఆస్తుల కొనుగోలు, వ్యాపార పెట్టుబడుల్లోకి మళ్లించారా? మనీలాండరింగ్ జరిగిందా? అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. భీమ్‌రెడ్డికి హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్‌చెరుతో పాటు కర్ణాటక, బెంగళూరు పరిసరాల్లో దాదాపు 20 వరకు పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ లిస్టులో అధికభాగం ఆస్తులు వాచ్‌మెన్, మాజీ హోంగార్డు వంటి తన బినామీల పేర్లపై ఉండటంతో ఆదాయపు పన్ను (IT) శాఖలోని బినామీ నిషేధిత విభాగం కూడా విచారణ ముమ్మరం చేసినట్టు తెలిసింది.
భీమ్‌రెడ్డి తన అక్రమాస్తులకు సంబంధించిన వివరాలను ఓ డైరీ రాయడం.. అది కాస్త ఏసీబీకి దొరకడంతో ఆయన చిట్టా బయటకు వచ్చింది. ఆ డైరీలో బినామీల వివరాలు,పెట్టుబడుల సమాచారం ఆధారంగానే మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. భారీగా అవినీతికి పాల్పడిన కేసులో గత జూలై 6న భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపగా.. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.












