తెలంగాణ

వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?

రచన: Kashi10 నిమిషాల పఠనం

సురేఖను కేబినెట్‌ నుంచి తప్పిస్తే.. ఆమె రాజకీయంగా సైలెంట్‌గా ఉండే అవకాశాలు తక్కువనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె వైఖరిని చూస్తే, రాజీనామా చేసి నిష్క్రమించడం కంటే తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. తనపై కుట్ర జరుగుతోందని, తనకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ఆమె అధిష్ఠానం ముందు వాదించారు.

కొండా ఎపిసోడ్ చుట్టే తెలంగాణ పాలిటిక్స్

హ‌స్తిన వైపు ఆస‌క్తిగా ఎదురుచూపు

సురేఖ‌పై వేటుప‌డితే.. త‌ర్వాత స్టెప్ ఏంటి..?

పొలిటిక‌ల్ గేమ్‌కు సిద్ధ‌మైన బీజేపీ, బీఆర్ఎస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన కొండా సురేఖ ఎపిసోడ్‌ ఇప్పుడు కేవలం ఒక మంత్రి భవితవ్యానికి సంబంధించిన వ్యవహారంగా కనిపించడం లేదు. కేబినెట్‌ నుంచి సురేఖను తప్పిస్తే.. ఆ తర్వాత ఆమె రాజకీయ భ‌విష్య‌త్ ఏమిటి? తన పోరాటాన్ని ఎక్కడి నుంచి కొనసాగిస్తారు? కాంగ్రెస్‌లోనే ఉండి ఢీకొంటారా? లేక బయటకు వచ్చి రాజకీయంగా కొత్త దారి ఎంచుకుంటారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆమెను కేబినెట్ నుంచి తొల‌గిస్తే.. ఆ పరిణామాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రాజకీయ ఆయుధంగా మార్చుకునే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది ఆసక్తికరంగా మారింది.

టు దిశగా అడుగులు.. తుది నిర్ణయం పెండింగ్‌

కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలోని పలువురు నేతలు సురేఖపై చర్యలు కోరారు. సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖను కేబినెట్‌ నుంచి తప్పించాలని సిఫారసు చేసింది.

వేటు పడితే.. సురేఖ ఏం చేస్తారు?

అసలు ఆసక్తి ఇక్కడే మొదలవుతుంది. సురేఖను కేబినెట్‌ నుంచి తప్పిస్తే.. ఆమె రాజకీయంగా సైలెంట్‌గా ఉండే అవకాశాలు తక్కువనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె వైఖరిని చూస్తే, రాజీనామా చేసి నిష్క్రమించడం కంటే తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తనపై కుట్ర జరుగుతోందని, తనకు అన్యాయం జరుగుతోందని ఆమె అధిష్ఠానం ముందు వాదించారు.

మరో ముఖ్యమైన అంశం బీసీ రాజకీయాలు. సురేఖ తనపై చర్య తీసుకుంటే బీసీ వర్గాలు ఏకమయ్యే అవకాశం ఉందని ఆమే హెచ్చ‌రించారు. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి వర్గాలకు చెందినవారమని, ఈ రెండు వర్గాల ఓట్ల వాటా కలిపి 16 శాతం ఉంటుందని ఆమె చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ రక్షణ వాదనగా చూడాలా.. లేక భవిష్యత్తులో ఒక పెద్ద సామాజిక రాజకీయ నేరేషన్‌కు పునాది వేస్తున్నారా అన్నది ఆస‌క్తి క‌లిగిస్తోంది.

బీఆర్‌ఎస్‌కు దొరికే ఆయుధం ఇదేనా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్.. ప్రభుత్వంపై అసంతృప్తిని తిరిగి రాజకీయంగా సమీకరించడం. ఇప్పుడు కొండా సురేఖకు వేటు పడితే.. బీఆర్‌ఎస్‌కు మరో రాజకీయ అస్త్రం దొరికినట్టవుతుంది.

బీఆర్‌ఎస్‌ దీన్ని కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి, సొంత పార్టీ నేతలకే స్వేచ్ఛ లేదు, ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు అనే నేరేషన్‌తో ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అన్నిటికీ మించి బీసీ కార్డును బ‌లంగా ప్లే.. చేసే అవ‌కాశ‌ముంది. ఇప్పటికే ప్రభుత్వం మీద రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ కూడా విడుదల చేసింది. ఈ సమయంలో కొండా ఎపిసోడ్‌ బయటపడటం ఆ పార్టీకి కాంగ్రెస్‌ అంతర్గత విభేదాలను హైలైట్‌ చేసే అదనపు అవకాశం కావ‌చ్చు.

అయితే బీఆర్‌ఎస్‌ ఇక్కడ ఒక జాగ్రత్త పాటించే అవ‌కాశ‌ముంది. సురేఖ గతంలో బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా అనుబంధం ఉన్న నాయకురాలే అయినప్పటికీ.. ఇప్పుడు ఆమెను మ‌రోసారి పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌రుగుతున్న ప‌రిణామాల ప్ర‌కారం.. కాంగ్రెస్‌లోని విభేదాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంపైనే బీఆర్ఎస్ ఫోక‌స్ ఎక్కువగా ఉండొచ్చు.

బీజేపీకి మరో ఛాన్స్‌ ఎలా వస్తుంది?

తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ప్రధాన పోరులో తాము కూడా ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. తాజాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం బీజేపీదేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వేటు పడితే బీజేపీ కూడా కాంగ్రెస్‌పై మరో కోణంలో దాడి చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో నాయకులకు గౌరవం లేదు.. అంతర్గత విభేదాలను పరిష్కరించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అనే రాజకీయ సందేశాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేయవచ్చు. ముఖ్యంగా బీసీ రాజకీయాలను సురేఖ తెరపైకి తీసుకొస్తే.. బీజేపీ కూడా ఆ చర్చను తన రాజకీయ వ్యూహానికి అనుగుణంగా మలుచుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ ఒక కీల‌క అంశం ఉంది. బీజేపీకి నిజమైన లాభం రావాలంటే సురేఖ వ్యవహారం కేవలం కాంగ్రెస్‌ అంతర్గత గొడవగా కాకుండా.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీకగా ప్రజల్లోకి వెళ్లాలి. అది జరిగితేనే ఈ ఎపిసోడ్‌ బీజేపీకి ఎన్నికల పరంగా ఉపయోగపడుతుంది.

కాంగ్రెస్‌కు అసలు టెన్షన్‌ ఇక్కడే!

కొండా సురేఖను తొలగించడం ద్వారా కాంగ్రెస్‌ ఒక సందేశాన్ని ఇవ్వొచ్చు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్య తప్పదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు రావడం వంటి వాటికి చెక్‌ పెట్టే ప్రయత్నంగా దీనిని చూపించవచ్చు. రేవంత్‌ కూడా పార్టీ క్రమశిక్షణ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే స్పష్టం చేశారు.

కానీ మరోవైపు.. పార్టీ వేసే వేటు సురేఖను రాజకీయంగా మరింత యాక్టివ్‌ చేస్తే పరిస్థితి కాంగ్రెస్‌కే బూమ‌రాంగ్‌గా మారొచ్చు. ఆమె బీసీ కార్డు, వరంగల్‌ రాజకీయ ప్రభావం, కుటుంబ రాజకీయ బలం వంటి అంశాలను ముందుకు తీసుకొస్తే.. ఒక మంత్రి తొలగింపు వ్యవహారం క్రమంగా కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని పక్కన పెడుతున్నారా? అనే పెద్ద రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాజకీయాలను షేక్‌ చేసేంత సీన్‌ ఉందా?

ఇప్పటికైతే దీనిని తెలంగాణ రాజకీయాలను పూర్తిగా షేక్‌ చేసే స్థాయి పరిణామంగా చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే సురేఖపై వేటు పడుతుందా? పడితే ఆమె తదుపరి వ్యూహం ఏమిటి? ఆమెతో ఎంతమంది కాంగ్రెస్‌ నేతలు నిలబడతారు? బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఈ అంశాన్ని ఎంతకాలం రాజకీయంగా మోసుకెళ్తాయి? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.

కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం. కొండా సురేఖపై వేటు పడితే కథ అక్కడితో ముగిసే అవకాశం లేదు. అది కాంగ్రెస్‌ అంతర్గత క్రమశిక్షణ సమస్య నుంచి బీసీ రాజకీయాల వరకు, వరంగల్‌ రాజకీయాల నుంచి ప్రతిపక్షాల వ్యూహాల వరకు విస్తరించొచ్చు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు కాంగ్రెస్‌పై కొత్త అటాక్‌ పాయింట్‌ కూడా దొరుకుతుంది.

#Konda Surekha#Telangana Politics#Telangana Congress#Revanth Reddy#BJP Telangana#BRS Telangana#Konda Surekha Issue#Telangana Political Crisis#Congress Government#Telangana News#BJP#BRS#Political Analysis#Telangana Politics 2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి