మొన్నటివరకు భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో భారత రూపాయి బలంగా పుంజుకుంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపీ మారకం విలువ ఏకంగా 47 పైసలు ఎగబాకింది.
దీంతో ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారతీ రూపాయి విలువ 94.26 వద్ద కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ప్రారంభంలో 94.30 వద్ద ప్రారంభమైన రూపాయి.. కొనుగోళ్ల మద్దతుతో మరింత బలపడి 94.26 వద్దకు చేరుకుని లాభాలబాట పట్టింది. అంతకుముందు రోజు ముగింపు సమయానికి రూపాయి విలువ 22 పైసలు లాభపడి 94.73 వద్ద స్థిరపడగా, తాజా సెషన్‌లోనూ అదే సానుకూల జోరును కొనసాగించి బలాన్ని పుంజుకుంది.
అయితే, విదేశీ మారక ద్రవ్య లిక్విడిటీని పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్ల ద్వారా రికార్డు స్థాయిలో భారీగా విదేశీ మారక నిధులు వచ్చి చేరడమే రూపాయి బలపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫారెక్స్ మార్కెట్ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా బాండ్ ఈల్డ్స్ ఒత్తిడి వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ జోక్యంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII) వెల్లువలా వస్తున్నట్టు తెలిసింది. విదేశీ సంస్థలు దేశీయ మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కథనాలు రావడం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో రన్ అవ్వడానికి మరో కారణమని నిపుణులు అంచనా వేస్తున్నాయి. రెండ్రోజుల కింద ప్రధాని మోడీ సైతం స్వదేశీ మంత్రంతో ప్రజలు ముందుకు సాగాలని.. విదేశాల్లో పెళ్లిళ్లు, టూర్లను రద్దు చేసుకోవాలని పిలుపునివ్వడం కూడా రూపీ బలపడటానికి మరో కారణంగా తెలుస్తోంది.












