హైదరాబాద్ మహానగరంలో భారీ పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. బొల్లారం పరిధిలో పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. బొల్లారం పీఎస్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో గల ఫైరింగ్ రేంజ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ బకెట్‌లో 160కు పైగా డిటోనేటర్లు పెట్టగా అధికారులు వాటిని గుర్తించినట్టు తెలిసింది.
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. బకెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్ స్క్వాడ్.. ఒక్కో బండిల్‌లో 20 చొప్పున మొత్తం 8 బండిళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని.. దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభించిట్టు సమాచారం.
ఇదిలాఉండగా, నగరంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపులో మూడు రోజుల కిందట అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే వారికి బకెట్‌లో ఉంచిన డిటోనేటర్లు వెలుగు చూడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఆయుధాల చోరీకి, ఈ పేలుడు పదార్థాల నిల్వకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సైనిక స్థావరం పరిసరాల్లో భారీ మొత్తంలో డిటోనేటర్లను ఎవరు వదిలి వెళ్లారనే అంశంపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. స్థానికంగా గల సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వ్యక్తుల కదలికలను గుర్తించి బకెట్ ఎవరు పెట్టారనే దానిపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్మీ క్యాంపులో ఆయుధాలు చోరీకి గురవ్వడం, డిటోనేటర్లు బయటపడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.











