గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిగతా వాటిల్లోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది. అనుకున్నవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అటు కాళేశ్వరం మీద విచారణ కమిషన్ వేసింది. పీసీ ఘోష్ కమిషన్ రెండేండ్ల పాటు విచారించి నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేశారు.
అదేవిధంగా సిద్ధిపేటలో నిర్మించిన కొండచపోచమ్మ సాగర్ పైనా విజిలెన్స్ విచారణకు సర్కారు ఆదేశించింది. ఇప్పటికే విచారణ కూడా పూర్తయి ఆరు నెలలు గడుస్తోంది. అయినా నేటి వరకు ప్రభుత్వానికి నివేదిక అందలేదని తెలుస్తోంది.దీనివెనుక ఏం జరుగుతోందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే విచారణ పూర్తయ్యాక సర్కారుకు ఉన్నతాధికారులు నివేదిక అందించాలి. కానీ, ఇంకా అందలేదు. విచారణ బృందం మాత్రం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్టు సమాచారం.
కొందరు అధికారులు రిపోర్టును తొక్కిపెడుతున్నారా? అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి.కావాలనే కొందరు ప్రోద్బలంతో నివేదిక చివరి స్టేజీలో ఆగినట్టు ప్రచారం జరుగుతున్నది. 2025లోనే విజిలెన్స్ విచారణ ప్రారంభం అవ్వగా..అదే సంవత్సరం చివరలోనే విచారణ పూర్తయినట్టు తెలిసింది. ఈ రిజర్వాయర్‌ను మేఘాతో పాటు కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు నిర్మించాయి. వీటితో పాటు కొన్ని కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చాయి. విజిలెన్స్ విచారణలో పలు అక్రమాలు బయటపడినట్టు తెలిసింది.
కానీ,ఇప్పటివరకు నివేదిక ప్రభుత్వానికి ఇవ్వకపోయినా అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీద చేపట్టిన విచారణలో భాగంగా బాధ్యులైన అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిపివేసింది.కానీ, కొండపోచమ్మ సాగర్‌లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపినప్పటికీ రిపోర్టు సర్కారు అందలేదు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన అధికారులకు మాత్రం ప్రమోషన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.












