కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు.ముద్రగడ ఇకలేరని తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పలువురు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. కాగా, ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముద్రగడ ప్రస్థానం ఇలా..
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం. పాఠశాల, ఉన్నత విద్యాను జిల్లాలో పూర్తి చేశారు. మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి వీరాభిమాని అయిన వాళ్ల తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాత్తుగా మరణించగా.. నీలం సంజీవరెడ్డి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అలా తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ముద్రగడ మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయబోనని ప్రకటించారు. 2009లో వైఎస్ ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు. కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. అనంతరం కాపు సోదరులు విజ్ఞప్తి మేరకు ముద్రగడ కాపు ఉద్యమ బాధ్యతను స్వీకరించి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు.












