TG: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అవినీతి బాగోతం బట్టబయలైంది. లంచం కోసం కాంట్రాక్టర్‌ను వేధిస్తున్న పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) కల్లేపల్లి సతీశ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం వలపన్ని మరీ పట్టుకున్నారు. కాంట్రాక్ట్ బిల్లు క్లియర్ చేయడానికి బాధితుడి నుంచి రూ.2లక్షలు లంచం డిమాండ్ చేసి, ఆ సొమ్మును తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణ పరిధిలోని తెనుగువాడ, కునారం రోడ్డు ప్రాంతాల్లో గల హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్‌కు రూ.12.28 లక్షల తుది బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లును ప్రాసెస్ చేసి, చెల్లింపుల కోసం పైఅధికారులకు పంపాల్సి ఉండగా.. ఏఈ సతీశ్ కుమార్ లంచం ఇస్తేనే పని జరుగుతుందని కాంట్రాక్టర్‌ను వేధించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత కాంట్రాక్టర్ వెంటనే కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. సతీశ్ కుమార్ తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి రూ.2లక్షల లంచం డబ్బును తీసుకుంటుండగా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏఈ నివాసంలో అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇళ్లంతా భారీ నోట్ల కట్టలను గుర్తించారు. ఆ కట్టలన్నింటినీ లెక్కించగా ఏకంగా రూ.32,31,900 ఉన్నట్లు గుర్తించి అధికారులు సైతం విస్తుపోయారు.
ఆ నిధులు ఎక్కడివన్న దానికి ఏఈ సమాధానం చెప్పలేకపోవడంతో లంచం సొమ్ముతో పాటు ఆ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన మున్సిపల్ ఏఈ సతీశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే ఆయన్ను కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరారు.












